Prosocial | న్యూఢిల్లీ, మే 3: సామాజికంగా, ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారితో పోలిస్తే అధిక ఆదాయం, ఆర్థికంగా పైస్థాయిలో ఉన్నవారిలోనే సామాజిక బాధ్యత అధికంగా ఉంటుందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. పీఎన్ఏఎస్ నెక్సస్ ప్రచురించిన సమగ్ర ప్రపంచ అధ్యయనంలో సంపదకు, దాతృత్వానికి మధ్య ఉన్న బంధం వెల్లడైంది.
బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 76 దేశాల వ్యాప్తంగా 80,000 మందినిపైగా ఈ అధ్యయనం కోసం ప్రశ్నించారు. ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొని, వాటిని అధిగమించి సంపన్నులుగా ఎదిగిన వ్యక్తులు విరాళాలు ఇవ్వడం, స్వచ్ఛంద సేవ చేయడం, ఇతరులకు సాయపడడం వంటి దాతృత్వ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
డబ్బు సంపాదన పెరిగే కొద్దీ సామాజిక బాధ్యత తగ్గిపోతుందన్న భావన చాలా మందిలో ఉందని, అయితే ఇది కేవలం అపోహ మాత్రమేనని బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ ప్రొఫెసర్, అధ్యయన సహ రచయిత పాట్రీషియా లాక్వుడ్ తెలిపారు. దాతృత్వ కార్యక్రమాల కోసం అధికంగా విరాళాలు ఇచ్చే వ్యక్తులు సంపన్నులలోనే అధికంగా ఉన్నారని, ఈ సుగుణం అనేక దేశాలలో కనిపించిందని ఆయన చెప్పారు.