ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ ప్రాంతమది. పేరు ధారావి. 620 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. జనాభా పన్నెండు లక్షలు. అందరూ పేదలే. ఓ పబ్లిక్ టాయిలెట్‌ను 1920 మంది వినియోగిస్తారంటే, అక్కడి జీవన పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పేదల ప్రాంతాన్ని షాంఘైలా మారుస్తానంటూ గౌతమ్ అదానీ ముందుకొచ్చారు. ఇంకేముంది.. గతంలో ఓ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం.. అదానీ కంపెనీకి కొత్తగా కాంట్రాక్టును కారుచౌకగా కట్టబెట్టింది. అయితే, హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ సామ్రాజ్యం లోగుట్టు రట్టవుతున్నది. ఈ నేపథ్యంలో ‘అదానీ-ధారావి’ టెండర్‌పై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Dharavi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ధారావి మురికివాడ రూపురేఖలను మార్చడానికంటూ తీసుకొచ్చిన ‘ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్’ టెండర్‌ను అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ రియాల్టీ కంపెనీ గత నవంబర్‌లో చేజిక్కించుకొన్నది. అయితే, అదానీ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ కంపెనీలు చేజిక్కించుకొన్న పలు ప్రాజెక్టులపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ‘ధారావి’ టెండర్ కూడా ఉండటం గమనార్హం.
‘ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్’ కోసం అదానీ రియాల్టీ, డీఎల్ఎఫ్, నమన్ గ్రూప్ పోటీపడ్డాయి. కనీస బిడ్ రూ.1,600 కోట్లు కాగా.. డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లకు టెండర్లను దాఖలుచేసింది. ఇక, అదానీ రియాల్టీ రూ.5,069 కోట్లకు టెండర్లు వేసింది. దీంతో అదానీ కంపెనీకే ప్రాజెక్టు ఖరారైంది. ఈ ప్రాజెక్టును 17 ఏండ్లలో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలిదఫాలో వచ్చే ఏడేండ్లలో మురికివాడలోని వాసులను వేరే ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది.
‘ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్’ టెండర్‌ను రూ.7,200 కోట్లకు యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ 2019లో దక్కించుకొన్నది. అయితే, గత జూన్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ టెండర్‌ను రద్దు చేసింది. కొత్త టెండర్లను పిలిచి రూ.5,069 కోట్లకే అదానీ కంపెనీకి ప్రాజెక్టును కట్టబెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొవిడ్ ఉద్ధృతి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి-డాలర్ రేట్, పెరిగిన వడ్డీ రేట్లు తదితర అంశాల వల్లే కొత్తగా టెండర్‌ను పిలిచామని పేర్కొన్నది.ఆర్థిక కారణాలను సాకుగా చూపెడుతున్న ప్రభుత్వం.. గత కంపెనీ ఆఫర్ చేసిన దాని కంటే రూ. 2 వేల కోట్ల అగ్గువకు అదానీకి ధారావి ప్రాజెక్టును కట్టబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చివేసిన ఐదు నెలల్లోనే ఈ తంతును బీజేపీ సర్కారు పూర్తిచేయడం గమనార్హం. కాగా, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సెక్లింక్ కంపెనీ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. టెండర్లో ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందని, అదానీ సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టడానికే తమ కాంట్రాక్టును రద్దు చేసిందని ఆరోపించింది.
ఈ ప్రాజెక్టులో స్థానికులకు ఇండ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అదానీ కంపెనీ ఇప్పటివరకూ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టలేదు. ప్రాజెక్టు అభివృద్ధి కోసం ‘స్పెషల్ పర్పస్ వెహికిల్‌ను’ (ఎస్పీవీ) ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడట్లేదు. అయితే, స్థానికులను వేరే ప్రాంతాలకు వెళ్లాలంటూ నోటీసులు ఇస్తున్నట్టు సమాచారం. అభివృద్ధి చేసిన న్యూ ధారావిలో స్థానికులకు అత్యాధునిక నివాస గృహాలను కట్టించి ఇస్తామంటూ హామీనిచ్చిన ప్రభుత్వం, అదానీ కంపెనీ ఇప్పుడు కొత్త నిబంధనలు పెడుతున్నట్టు స్థానికులు వాపోతున్నారు. జనవరి 1, 2000 కంటే ముందు నుంచి ధారావిలో నివసిస్తున్నట్టు రికార్డులు చూపించినవారికే కొత్త ఇండ్లు కట్టిస్తామని మెలిక పెడుతున్నట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటల్ విలువ వంద బిలియన్ డాలర్లమేర క్షీణించింది. ఈ క్రమంలో ధారావి వంటి పెద్ద ప్రాజెక్టును అదానీ రియాల్టీ ఏ మేరకు పూర్తిచేయగలదన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ.. ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు తమను ఇక్కడి నుంచి తరిమికొట్టి కోట్లాది రూపాయల విలువజేసే భూములను చేజిక్కించుకోవడానికే అదానీ కంపెనీ కొత్త నిబంధనలను తెరపైకి తెస్తున్నట్టు స్థానికులు మండిపడుతున్నారు. కాగా, రీ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం భూసేకరణ, మౌలిక సదుపాయాలను కల్పించి పెట్టుబడులను ఆకర్షించడం, స్థానికులకు సకల వసతులతో పునరావాసాన్ని ఏర్పాటు చేయడం అదానీ కంపెనీ ముందున్న సవాళ్లని విశ్లేషకులు అంటున్నారు.
జనాభా: 12 లక్షలు
ఇండ్లు: 2 లక్షలు
పబ్లిక్ టాయ్లెట్లు: 520
చిన్న ఇండస్ట్రీలు: 20,000
ఏరియా విస్తీర్ణం: 620 ఎకరాలు
భూమి విలువ: 10 లక్షల కోట్లు
అదానీ కాంట్రాక్ట్ విలువ: రూ.5,069 కోట్లు