గోపాల్గంజ్: బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద 50 గ్రాముల రేడియోధార్మిక పదార్థం(Radioactive Substance) కలిగి ఉన్నట్లు నిర్ధారించారు. ఆ రేడియోయాక్టివ్ పదార్థం విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి.. ఆ పదార్థం గురించి గోపాల్గంజ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. వేగులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. కుచాయికోట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బాల్తారి ఏరియాలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ఆ వ్యక్తుల వద్ద 50 గ్రాముల కాలిఫోరియం అనే రేడియోధార్మిక పదార్ధంతో పాటు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కాలిఫోర్నియం పదార్ధాన్ని పరిశీలించేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రప్పించారు. న్యూక్లియర్ రియాక్టర్లను ప్రారంభించేందుకు కాలిఫోర్నియం రేడియోయాక్టివ్ పదార్ధాన్ని వాడుతారు. బొగ్గు విద్యుత్తు ప్లాంట్లలో, క్యాన్సర్ చికిత్స, ఆయిల్ డ్రిల్లింగ్ కోసం ఈ అణుధార్మిక పదార్ధాన్ని వాడనున్నట్లు అధికారులు తెలిపారు.