కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో యువ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై మళ్లీ విచారణ జరుపాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. (RG Kar Case) సాక్ష్యాలు తారుమారు చేశారన్న బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలపై తాజాగా మొదటి నుంచి సీబీఐ దర్యాప్తు జరుపాలని గురువారం పేర్కొంది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ (తూర్పు జోన్) నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని న్యాయమూర్తులు శంపా సర్కార్, తీర్థంకర్ ఘోష్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
కాగా, సంఘటన జరిగిన 2024 ఆగస్ట్ 9వ తేదీ రాత్రి వైద్యురాలు భోజనం చేసినప్పటి నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన అన్ని సంఘటనలను సిట్ తిరిగి పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. సాక్ష్యాలు ధ్వంసం చేశారని, కేసును అణచివేసి, దాని తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయన్న బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలను పరిశీలించాలని సూచించింది. దర్యాప్తు కోసం ఎవరినైనా ప్రశ్నించడానికి సీబీఐకి పూర్తి స్వేచ్ఛను కూడా హైకోర్టు ఇచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణ జరిగే జూన్ 25 లోపు దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్‌ను కోరింది.
అయితే ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో యువ ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బెంగాల్‌ను కుదిపేసింది. ఆ రాష్ట్ర వైద్యులు పలు రోజుల పాటు నిరసనలు కొనసాగించారు. చివరకు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్నది.
మరోవైపు నిందితుడైన పౌర స్వచ్ఛంద కార్యకర్త సంజయ్ రాయ్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే తమ కుమార్తెపై హత్యాచారం కేసులో ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసుపై మరోసారి దర్యాప్తు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి తాజాగా దర్యాప్తు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.