బెంగళూరు: తమ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన ప్రదేశాలు, ఆస్తులు, బహిరంగ ప్రదేశాలలో ఆర్ఎస్ఎస్ ర్యాలీలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా కొత్త నిబంధనలను విధించడానికి మంత్రివర్గం గురువారం నిర్ణయించింది.
ఈ విషయాన్ని మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు. కొత్త రూల్స్ రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో అమలులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వ, బహిరంగ ప్రదేశాలలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై నిషేధాన్ని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసిన క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రియాంక్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో శాంతిభద్రతల అదుపుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాంగణాలు, బహిరంగ ప్రదేశాలలో సభలు, సమావేశాలకు అనుమతి తప్పక తీసుకోవాలని అన్నారు.