8th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వేతన కమిషన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కమిషన్‌లో చైర్‌పర్సన్‌తో పాటు సభ్యుడు (పార్ట్‌టైమ్), సభ్య కార్యదర్శి ఉంటారు. ప్రస్తుతం 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగియనున్నది. ఈ క్రమంలో కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో కేంద్ర మంత్రులతో పాటు మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. అనంతరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 8వ వేతన సంఘం 18 నెలల్లోగా సిఫారసలు సమర్పిస్తుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కమిషన్ సిఫార్సులు రక్షణ సేవా సిబ్బంది సహా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఉన్న జీతం, పింఛన్‌ను ఎంత వరకు పెంచాలో ఈ వేతన సంఘం కేంద్రానికి సిఫారసు చేరస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేస్తుంది.