Union Cabinet | వ్యవసాయరంగానికి సంబంధించిన ఏడు కీలమైన పథకాలను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. ఈ పథకాలకు కేంద్రం దాదాపు రూ.14వేలు కోట్లు ఖర్చు చేయనున్నది. రూ.2,817 కోట్ల డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పథకం, క్రాప్ సైన్స్ కోసం రూ.3,979 కోట్లు కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వ్యవసాయ విద్య, నిర్వహణను బలోపేతం చేసేందుకు రూ.2,291 కోట్ల విలువైన కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.
పశువుల సుస్థిర ఆరోగ్యం, వాటి ఉత్పత్తి కోసం రూ.1,702 కోట్లతో స్కీమ్‌కి సైతం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఉద్యానవనాల సుస్థిర అభివృద్ధికి రూ.860 కోట్లతో మరో బృహత్తర పథకానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతోపాటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసేందుకు రూ.1,202 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో సహజ వనరుల నిర్వహణకు సంబంధించిన పథకానికి రూ.1,115 కోట్లు వెచ్చించనున్నారు. ఏడు పథకాలకు రూ.13,960 కోట్లకుపైగా నిధులు కేటాయించినట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు.