Mission Mausam | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: వర్షానికి వేళాపాళా ఉండదు. అవసరం ఉన్నప్పుడు పడదు. అవసరం లేనప్పుడు కుంభవృష్టి కురుస్తుంది. అలాకాకుండా, మనకు అవసరం ఉన్నప్పుడే వర్షం కురిస్తే..! పండుగలకు, పబ్బాలకు కురవకుండా చేయగలిగితే..! భలేగా ఉంటుంది కదూ. ఆ దిశగా భారత శాస్త్రవేత్తలు ప్రణాళిక రచిస్తున్నారు. ఇందుకు గానూ కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించిన ‘మిషన్ మౌసమ్’లో భాగంగా వచ్చే ఐదేండ్లలో కీలక పరిశోధనలు జరగనున్నాయి. వడగండ్లు, ఉరుములు, మెరుపులను కూడా నియంత్రించే దిశగా ఆలోచిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్‌పై ప్రధానంగా పరిశోధనలు కొనసాగనున్నాయి.
ఆకాశంలోకి కొన్ని పదార్థాలను చల్లడం ద్వారా మేఘాలను ప్రభావితం చేయడాన్ని క్లౌడ్ సీడింగ్ అంటారు. ప్రస్తుతం సిల్వర్ అయోడైడ్, పొటాషియం ఐయోడైడ్, డ్రై ఐస్(సాలిడ్ కార్బన్ డయాక్సైడ్)ను క్లౌడ్ సీడింగ్‌కు వినియోగిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల నీటి ఆవిరి ద్రవ జలంగా మారి వర్షం కురుస్తుంది.
వాతావరణ మార్పులు వర్షాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టికి కారణమవుతున్నాయి. క్లౌడ్‌బరస్ట్‌ల వల్ల తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ వర్షం కురుస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మేఘాల ఎత్తు పెరుగుతున్నదని, విస్తరణ తగ్గడం వల్ల కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు పడుతున్నాయని, ఇంకొన్ని చోట్ల కరువు పరిస్థితులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు ఎక్కువ కావడానికీ ఇదే కారణం. ఈ పరిస్థితి నియంత్రించేందుకు మేఘాలను ప్రభావితం చేసి అతివృష్టి, అనావృష్టిని నివారించాలనేది శాస్త్రవేత్తల ఆలోచన.
‘మిషన్ మౌసమ్’ కార్యక్రమంలో భాగంగా పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటిరియాలజీ(ఐఐటీఎం)లో ఒక ‘క్లౌడ్ చాంబర్’ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో క్లౌడ్ సీడింగ్ సహా మేఘాలపై పరిశోధకులు అధ్యయనం చేయనున్నారు. ఇందుకు గానూ క్లౌడ్ చాంబర్ లోపల కృత్రిమ మేఘాలు తయారు చేసి పరిశోధనలు జరుపుతామని, వర్షాలు పెంచడంతో పాటు అడ్డుకోవడానికి క్లౌడ్ సీడింగ్ ద్వారా అవకాశాలను పరిశోధిస్తామని భూవిజ్ఞాన శాస్త్ర శాఖ కార్యదర్శి డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు. రానున్న ఐదేండ్లలో కృత్రిమంగా వర్షాన్ని పెంచడంతో పాటు తగ్గించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. క్లౌడ్ సీడింగ్ పద్ధతిని అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉపయోగిస్తున్నాయి.