న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: తమ డిమాండ్ల సాధనకు యాప్ ఆధారిత సేవలు అందిస్తున్న ఓలా, ఊబర్, రాపిడో, పోర్టర్, ఇతర సంస్థలకు చెందిన డ్రైవర్లు శనివారం దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె కారణంగా ట్యాక్సీ, బైక్, ఆటో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సర్వీసులు పని చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతో పాటు నగరాలు, పట్టణాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఊర్ల నుంచి వచ్చిన వారు ఈ సర్వీసులు ఎందుకు పనిచేయడం లేదో అర్థ్ధం కాక అయోమయానికి గురయ్యారు. సందట్లో సడేమియాలా ప్రైవేట్ ట్యాక్సీలు, ఆటోల వారు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను దోచుకున్నారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీయూడబ్ల్యూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ (ఐఎప్ఏటీ)లు ఇచ్చిన సంయుక్త పిలుపు మేరకు శనివారం డ్రైవర్లు సమ్మెలో పాల్గొనడంతో రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. యాప్ ఆధారిత రవాణా కార్మికులు దేశ వ్యాప్తంగా బ్రేక్ డౌన్ పాటించినట్టు తెలిపాయి. యాప్ ఆధారిత డ్రైవర్లు పేదరికంలో జారుకుంటుంటే అగ్రిగేటర్ ప్లాట్‌ఫాంలు లాభాలు గడిస్తున్నాయని యూనియన్ నేతలు ఆరోపించారు. డ్రైవర్లకు ఏకపక్షంగా ఇవే చార్జీలు నిర్ణయిస్తున్నాయని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండటం లేదని అన్నారు. దీని కారణంగా డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ డిమాండ్లను ఇకనైనా వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
బెంగళూరులో ఆటో డ్రైవర్ల దోపిడి మాటేమిటి?
బైక్ ట్యాక్సీలను నిషేధించాలని కోరుతూ ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో బెంగళూరు ఆటో డ్రైవర్లపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీటర్ల ప్రకారం చార్జీలు వసూలు చేయకుండా అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను బెంగళూరు ఆటో డ్రైవర్లు దోపిడీ చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఆటో డ్రైవర్ల చార్జీలను బలవంతపు వసూళ్లుగా ఆయన అభివర్ణించారు. ఎంతమంది మీటరుపై వెళుతున్నారని సోషల్ మీడియా వేదికగా ఆయన ఆటో డ్రైవర్లను ప్రశ్నించారు. జనవరిలో బైక్ ట్యాక్సీలకు అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీచేసిన అనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.