బెంగాల్, ఒడిశాలో 30న ఉప ఎన్నికలు

- 4 అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్
- అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు
- సీఎం పదవిలో కొనసాగాలంటే మమత గెలవడం తప్పనిసరి
- భవానీపూర్ నుంచి దీదీ పోటీ!
- దేశవ్యాప్తంగా 35 స్థానాలు ఖాళీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ర్టాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) శనివారం ప్రకటించింది. బెంగాల్లో భవానీపూర్, జంగీపూర్, శంషేర్ గంజ్ స్థానాలకు, ఒడిశాలో పిప్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. ఎన్నికల వేళ కొవిడ్ నిబంధనల అమలుపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ ఈ సందర్భంగా పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 14 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై ఎన్నికల సంఘం ఇటీవలే ఆయా రాష్ర్టాల అభిప్రాయాలను కోరింది. ఎన్నికల నిర్వహణకు సుముఖంగా ఉన్నట్టు పశ్చిమ బెంగాల్, ఒడిశా తెలిపాయి. కరోనా, వరదల వల్ల ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పండుగల సీజన్ కూడా ఉన్నదని మిగతా రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్) ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. పండుగల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే మేలని సూచించారు. దీంతో బెంగాల్, ఒడిశాల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. తమ రాష్ర్టాల్లో కరోనా పూర్తిగా అదుపులో ఉన్నదని బెంగాల్, ఒడిశా ఎన్నికల సంఘానికి తెలిపాయి. బెంగాల్ సీఎం మమత నవంబర్‌లోగా ఎమ్మెల్యేగా గెలవకపోతే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని, ప్రజాప్రయోజనం దృష్ట్యా ఎన్నికలు అనివార్యమని కోరినట్టు ఈసీ తెలిపింది. పండుగల సీజన్ తర్వాత మిగతా రాష్ర్టాల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నది.
మమతకు ఊరట
పశ్చిమ బెంగాల్లోనీ భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి మమత పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమత నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, రాజ్యాంగం ప్రకారం ఆమె 6 నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. లేకపోతే సీఎం పదవి నుంచి దిగిపోవాలి. మమత కోసం భవానీపూర్‌లో గెలిచిన టీఎంసీ అభ్యర్థి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మమత సీఎంగా కొనసాగడానికి నవంబర్ 5 వరకు గడువు ఉన్నది. అందుకే రాష్ట్రంలో ఉప ఎన్నికలు నిర్వహించాలని పలుమార్లు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం చేసిన తాజా ప్రకటన మమతతో పాటు, తృణమూల్ పార్టీకి ఊరట కలిగించింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్‌లోకి బీజేపీ నేతల వలస కొనసాగుతున్నది. బీజేపీ ఎమ్మెల్యే సౌమేన్ రాయ్ శనివారం టీఎంసీలో చేరారు. దీంతో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

