Crime news : దేశ రాజధాని (National capital) ఢిల్లీ (Delhi) లో సుమారు నెల రోజుల క్రితం జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చేధించారు. మృతురాలు శరీరంపై ఉన్న ముక్కు పుల్ల (Nose pin) నే ఈ కేసు చేధనకు ఉపయోగపడింది. ముక్కుపుల్ల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన అనిల్ కుమార్ ఓ వ్యాపారి. ఆయన భార్య సీమా సింగ్. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో సుమారుగా నెల రోజుల క్రితం సీమా సింగ్ను అనిల్ కుమార్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ బెడ్షీట్లో చుట్టి, దానికి రాళ్లు, ఇటుక కట్టి, కారులో తీసుకెళ్లి దక్షిణ ఢిల్లీలోని మురుగు కాల్వలో పడేశాడు. గత నెల 15న కాల్వలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు తేలింది. కానీ మృతురాలు ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో పోలీసుల కన్ను ఆమె ఒంటిపై లభించిన ముక్కు పుల్లపై పడింది. దక్షిణ ఢిల్లీలోని ఓ జ్యుయెలరీ దుకాణంలో ఆ ముక్కు పుల్లను చూపించగా.. అది తామే అమ్మినట్లు జ్యుయెలరీ యజమాని గుర్తించారు.
ఆ ముక్కు పుల్ల కొనుగోలుకు సంబంధించిన బిల్లును తీయగా అది అనిల్ కుమార్ పేరిట ఉంది. దాంతో అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. అతడి ద్వారా సీమా సింగ్ పుట్టింటి వారి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఈ నెల 1న వారిని పిలిపించి మృతదేహాన్ని గుర్తించాలని కోరారు. దాంతో సీమా సింగ్ సోదరి, కుమారుడు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని వారికి అప్పగించారు.
కాగా హత్య గురించి సీమా సింగ్ సోదరి బబితా సింగ్ మాట్లాడుతూ.. పోలీసులు చెప్పేవరకు తమ సోదరి హత్యకు గురైందనే విషయం తమకు తెలియదని అన్నారు. మార్చి 11న చివరిసారి సీమాకు ఫోన్ చేశానని, కానీ అనిల్ మాట్లాడాడని బబిత చెప్పింది. ప్రస్తుతం సీమా మనసు బాగోలేదని, మాట్లాడే మూడ్లో లేదని, ఆమె మంచి మూడ్లోకి వచ్చినప్పుడు తానే మాట్లాడిస్తానని అనిల్ కుమార్ చెప్పినట్లు ఆమె వెల్లడించింది. కానీ పోలీసులు హత్య వార్త చెప్పేవరకు అనిల్ కుమార్ ఫోన్ చేయించలేదని తెలిపింది.