ఎవరైనా వ్యక్తి తప్పు చేసినట్టు ఆరోపణలు వస్తే.. అతడు తప్పు చేశాడా, లేదా? అని నిర్ధారించి, శిక్ష వేయాల్సింది కోర్టు. ఏవైనా ఆరోపణలు రాగానే న్యాయన్యాయాలను విచారించకుండా ప్రభుత్వమే కూల్చడం చట్టాలను పాటించకపోవడమే అవుతుంది. ఇది తీవ్ర అనాగరికం, అన్యాయం. బుల్డోజర్ న్యాయం ఆమోదనీయం కాదు. అలాంటి కూల్చివేతలు వెంటనే ఆపాలి.
– ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నాయకురాలు (బుల్డోజర్ న్యాయంపై శనివారం చేసిన వ్యాఖ్యలు)
Priyanka Gandhi | న్యూఢిల్లీ, ఆగస్టు 24: ‘బుల్డోజర్ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని వెంటనే ఆపేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్లో ఛతార్పూర్ జిల్లాలో ఓ నిరసన సందర్భంగా చెలరేగిన హింసలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నివాసాన్ని ప్రభుత్వం కూల్చేసింది. ఈ ఘటనపై శనివారం ‘ఎక్స్’లో ప్రియాంక స్పందించారు. ‘ఏదైనా నేరంలో ఎవరైనా నిందితుడిగా ఉంటే, అతడి నేరాన్ని, శిక్షను కోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. ఆరోపణ రాగానే నిందితుడి కుటుంబాన్ని శిక్షించడం, వారికి నిలువ నీడ లేకుండా చేయడం, చట్టాన్ని ఉల్లంఘించడం, ఇంటిని కూలగొట్టడం న్యాయం కాదు. ఇది తీవ్ర అనాగరికం, అన్యాయం’ అని ఆమె పేర్కొన్నారు.
బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలి
చట్టాలు చేసే వారికి, చట్టాలు ఉల్లంఘించే వారికి తేడా ఉండాలని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రభుత్వాలే నేరస్థుల్లా ప్రవర్తించొద్దని అన్నారు. నాగరిక సమాజంలో చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, మానవత్వాన్ని పాటించడం తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. రాజధర్మాన్ని నెరవేర్చలేని వారు, సమాజం లేదా దేశ సంక్షేమం కోసం పని చేయలేరని అన్నారు. ‘బుల్డోజర్ న్యాయం’ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనిని ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.