Pakistan High Commission : పాకిస్తాన్‌కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. పాకిస్తాన్ చర్యకు ధీటుగా బదులిచ్చింది. ఇటీవల పాకిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయం వద్ద ఉన్న బారికేడ్లను పాక్ ప్రభుత్వం తొలగిస్తే.. ఇప్పుడు ఇండియా కూడా ఇక్కడ ఉన్న పాక్ రాయబార కార్యాలయం వద్ద బుల్డోజర్ చర్యకు దిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారత రాయబార కార్యాలయం ఉంది.
ఈ కార్యాలయం వద్ద ఉన్న సెక్యూరిటీ బారికేడ్లను ఇటీవల పాకిస్తాన్ ప్రభుత్వం తొలగించింది. ఇది జరిగి మూడు రోజులు అవుతోంది. దీంతో పాక్ చర్యకు భారత్ కూడా అదేరీతిలో బదులిచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వద్ద అదనంగా రక్షణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, ట్రాఫిక్ బొల్లార్డ్స్ వంటి నిర్మాణాల్ని బుల్డోజర్తో కూల్చేసింది. పాక్ రాయబార కార్యాలయ కాంపౌండ్ పరిధిలోని అనేక అనవసర నిర్మాణాల్ని కూల్చివేసింది. ఇది పాక్ చర్యకు బదులుగా చేసినట్లుగానే భావించాలి. అయితే, ఇండియా, పాక్ చేసిన ఈ చర్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత నెలకొనేందుకు దారితీసినవే.
ఇప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. గతేడాది పహల్గాం దాడి, అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఇరు దేశాల మధ్య వైరం మరింత పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇండియాలో అమెరికా రాయబారి సెర్గియో బుధవారం, గురువారం జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, లదాక్లలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సెర్గియో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్.. భారత్‌లో అంతర్భాగమే అని, అది ఇండియాకు చాలా ముఖ్యమైన ప్రాంతం అన్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పాక్.. ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇండియలో సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పాకిస్తాన్లో ఉన్న అమెరికా రాయబారి నటాలి బాకర్‌కు పాక్ సమన్లు జారీ చేయడం విశేషం.