హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సోమవారానికి వాయిదాపడింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ప్రసంగాన్ని ముగించిన అనంతరం స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌ను ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. బడ్జెట్ పూర్తిగా మోసమంటూ ప్రభుత్వంపై మండిపడింది.
భట్టి బడ్జెట్ ప్రసంగం చేస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు బడ్జెట్‌ను నిరసిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. ఈ బడ్జెట్‌తో బడుగుబలహీన వర్గాలకు ఎలాంటి లాభం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చివరికి బడ్జెట్‌ను నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం నెలకొన్నది.
కాగా ఉప ముఖ్యమంత్రి భట్టి ఇవాళ రూ.3,24,234 కోట్ల విలువైన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతంగా ప్రకటించారు. అనంతరం వివిధ శాఖలకు కేటాయింపుల వివరాలను వెల్లడించారు. అయితే ఈ బడ్జెట్‌పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతోపాటు పలువురు పెదవి విరుస్తున్నారు.