లక్నో : ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. దేశంలో యూసీసీని కాషాయ పార్టీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును బీఎస్పీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. యూసీసీలో అన్ని కోణాలను బీజేపీ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేసి బలవంతంగా యూసీసీని దేశంలో అమలు చేసే హక్కు ఎవరికీ లేదని ఆమె పేర్కొన్నారు.
ప్రతి కేసులో ఒకే చట్టం దేశంలోని అన్ని మతాలకు వర్తిస్తే అది దేశాన్ని బలోపేతం చేస్తుందని బీఎస్పీ చీఫ్ స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఈనెల 3న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చ జరగనున్న నేపధ్యంలో మాయావతి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.
దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. యూసీసీ అమలుపై సర్వోన్నత న్యాయస్ధానం సూచనలు చేసినా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకించాయని ప్రధాని గుర్తు చేశారు. ఒకే దేశానికి రెండు వ్యవస్ధలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.
Read More