Women’s Reservation Bill |భారత పార్లమెంటరీ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ప్రజాస్వామ్య భారతాన నవశకం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు ఎట్టకేలకు మంగళవారం పార్లమెంటు ముందుకొచ్చింది. కొలువుదీరిన కొత్త పార్లమెంట్లో ఇది తొలి ఘట్టం. ‘సెంట్రల్ విస్టా’లో ఇది తొలి బిల్లు.
35 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళాబిల్లును కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై బుధవారం 7 గంటలపాటు చర్చ జరుగనున్నది. అనేక పక్షాలు మద్దతిస్తున్న నేపథ్యంలో మహిళా బిల్లు ఆమోదం ఖాయంగా కనిపిస్తున్నది. అధికార పక్షానికి పూర్తిబలం ఉండటం, బీఆర్ఎస్ సహా పలు పార్టీలు ఇప్పటికే బిల్లుకు మద్దతు ప్రకటించడంతో.. పార్లమెంట్ ఆమోదం పొందడం లాంఛనమే కానున్నది.
పార్లమెంటు ఆమోదం పొందితే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారుతుందే తప్ప, అది అమల్లోకి వచ్చేది 2027 తర్వాతే. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసుకుని, పలు అడ్డంకులను దాటుకున్నాకే చట్టం కార్యరూపం దాలుస్తుంది. అదే జరిగితే ఇప్పుడు 82మంది మహిళా ఎంపీలున్న లోక్‌సభలో 181మంది అతివల ప్రాతినిధ్యాన్ని చూడొచ్చు. ఇది బంగారు స్వప్నం.. ఇది భావి భారత దృశ్యం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘకాలంగా పార్లమెంటులో నానుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి పార్లమెంటు ముందుకు వచ్చింది. లోక్‌సభ, రాష్ర్టాల శాసనసభల్లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లును ‘నారీశక్తి వందన్ అధినియం’ పేరుతో కేంద్రప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రావ్ు మేఘ్వాల్ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని తెలిపారు. మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న ఈ బిల్లుకు విపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తుండటంతో బిల్లు చట్టరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తున్నది. బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ, ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లును గురువారం ప్రవేశపెట్టనున్నారు.
మహిళా బిల్లుకు ప్రస్తుతం ఉభయసభల ఆమోదం లభించినా, చట్టసభల్లో మహిళలకు వెంటనే 33% రిజర్వేషన్ సాధ్యం కాదని తెలుస్తున్నది. 2027 తర్వాతే ఈ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక మహిళా చట్టం అమల్లోకి వస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలంటే జనగణన జరగాలి. 2021లోనే జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో 2026లో జనగణన, ఆ మరుసటి ఏడాది డీలిమిటేషన్ చేపట్టనున్నారు.
2010లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు (108వ రాజ్యాంగ సవరణ)-2008 బిల్లును రాజ్యసభ ఆమోదించింది. కొత్త బిల్లులో కొన్ని కొత్త రాజ్యాంగ సవరణలను చేర్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు (128వ రాజ్యాంగం సవరణ బిల్లు)-2023 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లను కేటాయించాలి. ఆర్టికల్ 330 ఏ ప్రకారం ఈ సూత్రం వర్తిస్తుంది.
ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. ఢిల్లీ అసెంబ్లీకి కూడా మహిళలకు మూడింట ఒకవంతు సీట్ల నియమం వర్తిస్తుంది.
లోక్‌సభ, అసెంబ్లీలకు ఈ రిజర్వ్డ్ సీట్ల కేటాయింపును పార్లమెంట్ నియమించిన అథారిటీ నిర్ణయిస్తుంది.
ఎస్సీ, ఎస్టీల సీట్లలో నుంచి మూడింట ఒక వంతు సీట్లను ఆయా వర్గాలకు చెందిన మహిళలకు కేటాయించాలి.
ఆర్టికల్ 334 ఏ ప్రకారం.. నియోజక వర్గాల పునర్విభజన పూర్తయ్యాకనే చట్టం అమల్లోకి వస్తుంది.
రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్ల్లో రొటేషన్ ప్రకారం వివిధ నియోజకవర్గాలకు రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఈ మహిళా రిజర్వేషన్లు రాజ్యసభ, రాష్ర్టాల్లోని శాసన మండళ్లకు వర్తించవు.
ఓబీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఈ బిల్లులో పొందుపరచలేదు.
చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రొటేషన్ ప్రకారం మూడు దఫాలుగా అన్ని స్థానాలకు
వర్తించే విధంగా 15 సంవత్సరాల కాల పరిమితితో ఈ రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. తదుపరి వీటిని పెంచుకునే అవకాశం ఉన్నది.
15 ఏండ్ల కాలపరిమితిలో ఒకసారి రిజర్వ్‌చేసిన సీటును మళ్లీ రిపీట్ చేయకూడదు.
రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత 15 ఏండ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనున్నది.
రాష్ర్టాల ఆమోదం కూడా..
మహిళా బిల్లుకు రాష్ర్టాల శాసనసభల ఆమోదం కూడా తప్పనిసరి. ఈ అంశం రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉండటంతో దేశంలోని మొత్తం రాష్ర్టాల్లో కనీసం సగం అంటే 14 రాష్ర్టాల అసెంబ్లీలు ఈ బిల్లును ఆమోదించాలి.
మహిళా బిల్లుపై గత నెలలో దాఖలైన పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌లు సంజయ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ‘అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసే ఉద్దేశం మీకు ఉందా లేదా? ఆ పిల్‌పై మీరు సమాధానం ఎందుకు దాఖలు చేయడం లేదు? ఇది అందరికీ సంబంధించిన విషయం కదా? దీనిని పక్కన ఎలా పడేస్తారు’ అని ప్రశ్నించింది. దీనిపై రాజకీయ పార్టీలు సైతం నాన్చుడు ధోరణితో ఉండటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సుప్రీం .. ‘దీనిపై మీరు కచ్చితంగా మీ సమాధానాన్ని సమర్పించాల్సిందే. దీనిపై రాజకీయ పార్టీలు ఏమంటున్నాయో మేము తెలుసుకోదలిచాం’ అని ధర్మాసనం పేర్కొంది.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు- 2008 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లను కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే మొత్తం సీట్లలో నుంచి మూడింట ఒక వంతు సీట్లను ఆయావర్గాలకు చెందిన మహిళలకు కేటాయించాలి. లోక్‌సభ, అసెంబ్లీలకు ఇది వర్తిస్తుంది. రాష్ర్టాలు, యూటీల్లో రొటేషన్ ప్రకారం రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రొటేషన్ ప్రకారం మూడు దఫాలుగా అన్ని స్థానాలకు వర్తించే విధంగా 15 సంవత్సరాల కాల పరిమితితో ఈ రిజర్వ్డ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఒకేసీటు ఉన్న యూటీలో ప్రతీ మూడో విడత ఎన్నికల్లో ఆ సీటు మహిళలకు కేటాయించాలి. లోక్‌సభలో ఆంగ్లో-ఇండియన్ల రెండు సీట్ల విషయంలోనూ ప్రతీ మూడు ఎన్నికల్లో వరుసగా జరిగే రెండు ఎన్నికల్లో ఒక్క సీటును మహిళలకు కేటాయించాలి. 15 ఏండ్ల కాలపరిమితిలో ఒకసారి రిజర్వ్ చేసిన సీటును మళ్లీ రిపీట్ చేయకూడదు.
1974: చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన తొలిసారిగా మొగ్గతొడిగింది. రాజకీయ సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యల్పంగా ఉందని కేంద్ర సాంఘిక మంత్రిత్వ శాఖకు ఓ కమిటీ సమర్పించిన నివేదికలో పేర్కొంది.
1993: పంచాయతీలు, మునిసిపాలిటీల్లో మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు జరిగాయి.
1996 సెప్టెంబర్ 12: దేవెగౌడ నేతృత్వంలోని యూనైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్‌సభ రద్దవ్వడంతో బిల్లుకు ఆమోదం లభించలేదు.
1996 డిసెంబర్ 9: సీపీఐ ఎంపీ గీతా ముఖర్జీ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లు. లోక్‌సభకు కమిటీ నివేదిక.
1998 జూన్ 26: వాజపేయీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు 12వ లోక్‌సభలో బిల్లును తిరిగి ప్రవేశపెట్టింది. ఆర్జేడీ ఎంపీ సురేంద్రప్రసాద్ యాదవ్ వెల్‌లోకి దూసుకెళ్లారు. అప్పటి స్పీకర్ బాలయోగి నుంచి పత్రాలను లాక్కొని చించిపారేశారు.
1999, నవంబర్ 22: ఎన్డీయే సర్కారు మరోమారు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది. అయితే, ఏకాభిప్రాయసాధనలో మళ్లీ విఫలమైంది.
2002: రెండుసార్లు బిల్లు ఆమోదానికి ఎన్డీయే విఫలయత్నం. బిల్లు ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని లెఫ్ట్, కాంగ్రెస్ హామీ. అయినా దక్కని ఫలితం. మరుసటి ఏడాది సేమ్ సీన్ రిపీట్.
2004: యూపీఏ ఉమ్మడి కార్యక్రమంలో బిల్లు ఆమోదమే లక్ష్యమని ఉద్ఘాటన.
2005: బిల్లుకు బీజేపీ మద్దతు.
2008 మే 6: రాజ్యసభలో బిల్లుప్రవేశపెట్టిన యూపీఏ. బిల్లు మురిగిపోకుండా ఉండేందుకే ఈ వ్యూహం. న్యాయవ్యవహారాల స్థాయీ సంఘానికి సిఫారసు.
2009 డిసెంబర్ 17: స్థాయీ సంఘ సిఫారసుల మేరకు.. ఎస్పీ, జేడీయూ, ఆర్జేడీ పార్టీల నిరసనల మధ్య ఉభయసభల ముందుకు బిల్లు.
2010 మార్చి 8: రాజ్యసభలో బిల్లు. పత్రాల చించివేత సీన్ రిపీట్.
2010 మార్చి 9: వ్యతిరేక ఎంపీల గెంటివేత. ఎట్టకేలకు రాజ్యసభలో బిల్లుకు ఆమోదం.
2014: లోక్‌సభ రద్దు కావడంతో మురిగిపోయిన బిల్లు.
2023 సెప్టెంబర్ 18: మహిళా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం.
2023 సెప్టెంబర్ 19: లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం.