BRS Public Meeting | బీఆర్ఎస్కు ద్వారనగరి ఔరంగాబాద్ స్వాగతం పలుకుతున్నది. వందేమాతర ఉద్యమం ఊపిరిపోసుకున్న నేల మరో మహా పోరాటానికి సన్నద్ధమవుతున్నది. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ నినాదంతో ఇప్పటికే మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టిస్తున్న భారత రాష్ట్ర సమితి.. మరాఠ్వాడాలో మూడో బహిరంగసభకు సిద్ధమైంది. నేడు జరుగనున్న సభకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవనుండగా, ఆయన రాక కోసం శంభాజీనగర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
(ఛత్రపతి శంభాజీనగర్ నుంచి నమస్తే తెలంగాణ బృందం) : మహారాష్ట్ర నడిగడ్డలో, సిటీ ఆఫ్ గేట్స్‌గా పేరుగాంచిన శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలో బీఆర్ఎస్కు విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభపై జిల్లా కేంద్రంలోనే కాకుండా మారుమూల పట్టణాల్లోనూ జోరుగా చర్చ సాగుతున్నది. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మరాఠా ప్రజల గుండెను హత్తుకొంటుండగా, అన్ని వర్గాల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నది. బీఆర్ఎస్ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహిస్తున్న మూడో సభపై అందరిలోనూ ఉత్సుకత నెలకొన్నది. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన మొదటి సభకు ఊహించని రీతిలో రైతులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 26న చిన్న తాలుకా కేంద్రమైన లోహలో సభ నిర్వహించగా వేల మంది రైతులు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి సీఎం కేసీఆర్‌కు నీరాజనం పలికారు. ఈ నేపథ్యంలో సోమవారం చారిత్రక నగరమైన చత్రపతి శంభాజీ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సభపై రాష్ట్రవ్యాప్తంగా అమితాసక్తి నెలకొన్నది.
సర్వం సిద్ధం
చత్రపతి శంభాజీనగర్ పట్టణ కేంద్రంలోని జబిందా ఎస్టేట్స్‌లో సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. పట్టణమంతా గులాబీమయమయ్యింది. ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులతో అలంకరించారు. వాటిని స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలచారి, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్‌రావు కదం, కాంధర్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
గ్రామగ్రామానా ముమ్మర ప్రచారం..
సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తునే తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు కలియ తిరుగుతున్నారు. శంభాజీ నగర్ జిల్లాలో ఔరంగాబాద్, సిల్లోడ్, సియోగావ్, వైజాపూర్, గంగాపూర్, ఫైఠాన్, ఫులంబ్రి, కన్నాడ్ తదితర తాలుకాలతోపాటు, జల్నా, జల్గావ్ జిల్లాల్లోని సమీప తాలుకాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఊరూరా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఔరంగాబాద్ జిల్లాలోని కన్నాడ్, గంగాపూర్ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయనేతలు హర్షవర్ధన్జాదవ్, సంతోష్మానె బీఆర్ఎస్లో చేరారు. అదీగాక జిల్లాకు చెందిన షేత్కరీ సంఘటన నేతలు కూడా గులాబీ కండువాలు కప్పుకొన్నారు. వారంతా ఊరూరా తిరుగుతూ తెలంగాణ పథకాలను, అభివృద్ధి విధానాలను వివరిస్తున్నారు. శంభాజీ నగర్ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన డిజిటల్ ప్రచార రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఛత్రపతి శంభాజీనగర్ బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
కేసీఆర్‌కే నా ఓటు
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా ఇక్కడ వ్యవసాయం మారలేదు. ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా ముందుకొచ్చిన కేసీఆర్‌కే ఈ సారి ఓటు వేస్తా.
-చంద్రకాంత్ పాండే, పాండేస్ కోచింగ్ సెంటర్, ఔరంగాబాద్
కనీస వసతులు లేవు
ఔరంగాబాద్‌లో కనీస వసతులు లేవు. తాగునీటికి ని త్యం కటకటే. భూగర్భజలాలు అడుగంటాయి. మంచినీటికి ట్యాంకర్లపై ఆధారపడాల్సిన దుస్థితి. ప్రజా సంక్షేమ పాలనలో ఇక్కడి పాలకులు విఫలమయ్యారు.
-రాజారాం, చిరు వ్యాపారి
వ్యవసాయం వదిలేసి టీకొట్టు పెట్టుకొన్నా..
నాకు 4 ఎకరాల భూమి ఉంది. సా గునీటి వసతిలేక వ్యవసాయం వదిలేసి టీ కొట్టు నడుపుకుంటున్నా. ఇక్కడి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు.
-జ్ఞానేశ్వర్, టీకొట్టు యజమాని, జాల్నా