న్యూఢిల్లీ, జూలై 19: భారతదేశంలో ఒకప్పుడు బహు భర్తృత్వం ఉండేది అన్న సంగతి విన్నాం. హిమాచల్ ప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ పాటిస్తున్న విషయం తాజాగా వెలుగుచూసింది. సిర్మౌర్ జిల్లాలో షిల్లే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికపై ఒక యువతిని వివాహం చేసుకున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు, సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతా చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. జూలై 12-14 మధ్య మూడు రోజులపాటు సాగిన వీరి వివాహ తంతును చూడటానికి సమీప గ్రామాల ప్రజలు, ఇరు కుటుంబాల బంధువులు, చుట్టుపక్కలవాళ్లు హాజరయ్యారు.
అంగరంగ వైభవంగా సాగిన ఈ పెండ్లిలో అతిథులకు ‘ట్రాన్స్-గిరి’ తెగకు చెందిన వివిధ వంటకాల్ని వడ్డించారట. ఈ వివాహం హట్టి తెగలోని బహుభర్తృత్వం సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ సంప్రదాయాన్ని ‘జోడిదరన్’, ‘ద్రౌపది ప్రథ’గా అక్కడ పిలుస్తారు. ఈ వివాహం పూర్తి సమ్మతితో జరిగిందని సునీతా చౌహాన్ చెప్పారు. ప్రదీప్ నేగి జల్ శక్తి విభాగంలో ఉద్యోగి, కపిల్ నేగి విదేశాల్లో ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు.