న్యూఢిల్లీ, జూలై 7: దేశం గర్వించదగ్గ ఇంజినీర్, బ్రిడ్జ్మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు అందుకున్న ‘పద్మశ్రీ’ గిరీష్ భరద్వాజ్(76) కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యంతో ఒక ప్రైవేట్ దవాఖానలో చేరిన ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన భరద్వాజ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకున్నారు.
దేశవ్యాప్తంగా 140కిపైగా వేలాడే వంతెనలు (సస్పెన్షన్ ఫుట్బ్రిడ్జ్) నిర్మించి, మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలను బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేశారు. తక్కువ ఖర్చుతో నిర్మించిన ఈ వంతెనలు గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతోమంది జీవితాలపై ప్రభావం చూపాయి. భరద్వాజ్ తన మొదటి సస్పెన్షన్ వంతెనను 1989లో పయస్విని నదిపై నిర్మించారు. తర్వాత ఆయన సేవలు కర్ణాటక, కేరళ సహా అనేక రాష్ర్టాల్లో విస్తరించటం ద్వారా ‘బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే బిరుదును సంపాదించిపెట్టాయి.