హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఎండ్రిన్ పార్టీ’ (టీఈపీ). ఈ పేరుతో తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ టీఈపీ పురుడుపోసుకొన్నదని ప్రచారం జరుగుతున్నది. పోలీస్ ఉద్యోగాల భర్తీ, పోస్టుల పెంపు డిమాండ్‌తో పోరాడుతున్న నిరుద్యోగులతో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘మీరు ఒర్లినా, పొర్లుదండాలు పెట్టినా.. ఎండ్రిన్ తాగి బావిలో దూకినా పోలీస్ ఉద్యోగాలు పెంచడం సాధ్యం కాదు’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. నిరుద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టగా, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఆధారం చేసుకొని తాజాగా సోషల్ మీడియాలో ఈ కొత్త ట్రెండ్ మొదలైందని అంటున్నారు. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ పేరుతో వెలిసిన ఒక సెటైరికల్ పోస్టర్ వైరల్ అవుతున్నది. పార్టీ జెండా, పార్టీ పేరు, వ్యవస్థాపకుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పేరును వ్యంగ్య ధోరణితో ప్రస్తావించారు. ఈ పోస్టు గంటల వ్యవధిలోనే వైరల్ అయింది. ఈ పోస్టును యువత విస్తృతంగా షేర్ చేస్తున్నది. అయితే ఈ ట్రెండ్ కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతుందా? లేక సీజేపీ స్థాయిలో నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తారా? రాజకీయాల్లో కొత్త ప్రచార అస్త్రంగా మారుతుందా? అనేది రానున్న రోజుల్లో తేలనున్నది.
దేశంలో మారిన ట్రెండ్
దేశ రాజకీయాల్లో ట్రెండ్ వరుస మారుతున్నది. కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తే ఏ స్థాయి వ్యక్తినైనా నేటి యువత వదలడం లేదు. పోస్టులు, మీమ్స్, ట్రోల్స్కే పరిమితం కావడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై, పాలసీలపై తమ అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసేవారు. ఇప్పుడు యువత ఈ ట్రెండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సృష్టించిన ప్రభంజనమే ఇందుకు తాజా నిదర్శనం. ఇదే స్ఫూర్తితో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఈపీ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది.