న్యూఢిల్లీ, మే 21: మధ్యప్రదేశ్ నర్సింగ్ కాలేజీ స్కామ్ కేసులో సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. తనిఖీల తర్వాత అనుకూలమైన నివేదికలు ఇచ్చేందుకు తమ అధికారులు ప్రతి ఇన్స్టిట్యూట్ నుంచి రూ.2-10 లక్షలు తీసుకొన్నట్టు దర్యాప్తులో వెల్లడైందని సీబీఐ తాజాగా పేర్కొన్నది. ఈ కేసులో 22 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారిలో మధ్యప్రదేశ్ పోలీసు శాఖ నుంచి సీబీఐలో అటాచ్మెంట్లో ఉన్న సీబీఐ డిప్యూటీ ఎస్పీ ఆశిష్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు రాహుల్ రాజ్, సుశీల్ కమార్తోపాటు రిషి కాంత్ అసథే ఉన్నారు.
వీరిలో రాహుల్ రాజ్‌ను ఆదివారం అరెస్టు చేశారు. కాలేజీల డైరెక్టర్లు, చైర్పర్సన్లు, సిబ్బంది, తనిఖీలకు వెళ్లిన సీబీఐ బృందాల తరపున లంచాలు సేకరించిన మధ్యవర్తుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది. మధ్యప్రదేశ్‌లో నర్సింగ్ కాలేజీలను తనిఖీ చేసేందుకుగానూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. మూడు బృందాలను సీబీఐ ఏర్పాటు చేసింది. ఇందులో సీబీఐ అధికారులతోపాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నామినేట్ చేసిన సిబ్బంది కూడా ఉన్నారు.