Maharashtra | పాల్ఘర్: ఒక సినిమాలోని సీరియల్ కిల్లర్‌ను స్ఫూర్తిగా తీసుకుని 13 ఏండ్ల బాలుడు ఆరేండ్ల బాలికను హతమార్చాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్సోపరకు చెందిన ఈ బాలుడు అందరూ ముద్దు చేస్తున్నారన్న అసూయతో వరుసకు కజిన్ అయిన ఆరేండ్ల బాలికను గొంతు పిసికి హతమార్చాడు. మృతదేహాన్ని పోలీసులు కొండ ప్రాంతంలో కనుగొన్నారు.
శనివారం ఆ బాలిక తప్పిపోయినట్టు గుర్తించిన బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, ఒక బాలుడు ఆమెను ఎక్కడికో తీసుకెళ్తున్న దృశ్యం కన్పించింది. ఆ బాలికను అతను గొంతునులిమి చంపాడు. అనంతరం రాయితో ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాడు.‘రామన్ రాఘవ్’ చిత్రంలోని సీరియల్ కిల్లర్ పాత్రను స్ఫూర్తిగా తాను ఈ హత్య చేసినట్టు ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెల్హార్ సీఐ జితేంద్ర చెప్పారు.