గౌహతి: పదేళ్ల బాలుడ్ని అతడి తల్లి ప్రియుడు హత్య చేశాడు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి చెట్ల పొదల్లో పడేశాడు. బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడి తల్లి ప్రియుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. (Boy Killed By Mother’s Lover) అస్సాం రాజధాని గౌహతిలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళకు చెందిన పదేళ్ల కుమారుడు శనివారం అదృశ్యమయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, భర్త నుంచి విడిపోయిన ఆ మహిళకు జితుమోని హలోయి అనే వ్యక్తితో సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. మహిళ ప్రియుడైన అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కుమారుడ్ని తానే హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి చెట్ల పొదల వద్ద పడేసినట్లు చెప్పాడన్నారు. దీంతో అక్కడకు వెళ్లి బాలుడి మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను గుర్తించినట్లు చెప్పారు.
మరోవైపు నిందితుడు జితుమోని హలోయిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అతడి ప్రియురాలైన మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాలుడి హత్యలో తల్లి పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. విడిపోయిన మహిళ భర్త స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.