Jamili Elections | న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ దిశగా మరో కీలక అడుగు పడింది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నిర్వహించేందుకు వీలుగా రెండు బిల్లులకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే వారమే ఈ ముసాయిదా బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తున్నది. వీటిపై విస్తృత సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీకి బిల్లులను సిఫారసు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ కమిటీ ద్వారానే వివిధ రాష్ర్టాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తున్నది. కాగా, జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించగా, సెప్టెంబర్‌లో క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ర్టాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి నిర్వహణకు రాజ్యాంగంలో మూడు కొత్త అధికరణలు చేర్చడంతో పాటు ప్రస్తుతం ఉన్న అధికరణల్లో 12 కొత్త సబ్ క్లాజ్‌లను చేర్చాల్సి ఉంటుందని, అసెంబ్లీలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన మూడు చట్టాలను మార్చాల్సి ఉంటుందని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫారసు చేసింది.
జమిలి ఎన్నికలు రాజ్యాంగవిరుద్ధమని, సమాఖ్యస్ఫూర్తికి వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తామని ఆమె ప్రకటించారు. జమిలి నిర్వహణకు సరిపోయే బలగాలు, సదుపాయాలు దేశంలో ఉంటే జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, జార్ఖండ్‌కు ఒకేసారి ఎందుకు ఎన్నికలు జరపలేదని శివసేన(యూబీటీ) ఎంపీ అనీల్ దేశాయ్ ప్రశ్నించారు. తమతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ పేర్కొన్నారు. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం జమిలిని వ్యతిరేకించాయి. బీజేపీ, ఎన్డీఏ పక్ష పార్టీలు మాత్రం స్వాగతించాయి. జమిలితో ఎన్నికల వ్యయం తగ్గుతుందని పేర్కొన్నాయి.
2026లో..
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి
2027లో..
మణిపూర్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్
2028లో..
హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్
2029లో..
ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్ము కశ్మీర్
జమిలి ఎన్నికలు జరుగాలంటే?
జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసేందుకు పార్లమెంటు ఉభయసభల్లో మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంది. స్థూలంగా చూస్తే ఉభయ సభల్లో ఎన్డీఏకు ఇంత మద్దతు లేదు. లోక్‌సభలో 362 మంది మద్దతు అవసరం కాగా, ఎన్డీఏకు ఇప్పుడు 293 మంది ఎంపీల మద్దతు ఉంది. అయితే, బిల్లులు సభలో ప్రవేశపెట్టినప్పుడు సభకు హాజరైన సభ్యుల సంఖ్యను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో విపక్షాల్లో అనైక్యత ఎన్డీఏకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు జమిలికి మద్దతు ఇవ్వడమో, సభకు గైర్హాజరు కావడమో జరిగితే బిల్లుల ఆమోదం సులువవుతుంది. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని సభ్యులు మరో 13 మంది వరకు ఉన్నారు.
రాజ్యసభలో జమిలి బిల్లుల ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా, ఎన్డీఏ బలం 125 మాత్రమే ఉంది. ఇప్పుడు మరో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని పార్టీల సభ్యులు 24 మంది ఉన్నారు. వీరి మద్దతుతో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు పొందినా లేదా సభకు గైర్హాజరైనా జమిలి బిల్లులు ఆమోదం పొందే అవకాశం ఉంది.
దీనికి తోడు జమిలి ఎన్నికల బిల్లుకు కనీసం 14 రాష్ర్టాల అసెంబ్లీల ఆమోదం అవసరం. ప్రస్తుతం 20 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ర్టాల అసెంబ్లీల ఆమోదం సులభమే. జమిలిపై కోవింద్ కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరగా.. 32 పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, ఆప్, సీపీఎం సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ లెక్కలన్నీ వేసుకొనే బీజేపీ ముందుకు వెళ్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.