ముంబై : షీనా బోరా (24) హత్య కేసులో మరో సంచలనం జరిగింది. ఈమె 2012 ఏప్రిల్‌లో హత్యకు గురైనట్లు 2015లో వెలుగులోకి వచ్చింది. ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా ఈ కేసులో ప్రధాన నిందితురాలు. షీనా మృతదేహాన్ని తగులబెట్టి, పూడ్చిపెట్టారు. పోలీసులు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఈ మృతదేహాన్ని గుర్తించి, ఎముకలు, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు ఫోరెన్సిక్ డాక్టర్ గురువారం సీబీఐ కోర్టులో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ స్పందిస్తూ, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలు, ఇతర వస్తువులు ఇప్పుడు కనిపించడం లేదని తెలిపింది. అయినప్పటికీ, వాటిని ఆ డాక్టర్‌కు చూపించకుండానే, చీఫ్ ఎగ్జామినేషన్‌ను కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపింది. దీనికి అభ్యంతరం లేదని డిఫెన్స్ అడ్వకేట్స్ చెప్పడంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.