Badlapur Case | బద్లాపూర్ పాఠశాలలో జరిగిన లైంగిక వేధింపుల కేసును విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాంబే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. థానేలోని బద్లాపూర్ ప్రాంతంలోని పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స్కూల్ అటెండర్ లైంగిక దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎన్కౌంటర్లో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత కేసును దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. పోస్కో చట్టంలోని నిబంధనల ప్రకారం.. పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు వ్యక్తులపై ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో బద్లాపూర్ స్థానిక పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వెలుగు చూడడంతో హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.
సుమోటోగా తీసుకొని కేసు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం బాంబే హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ రేవతి మోహితే డెరే, నీలా గోఖలే విచారణ జరుపగా.. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితెన్ ఛార్జిషీట్ దాఖలు చేశామని.. కేసు విచారణ జరుగుతుందని తెలిపారు. దాంతో ధర్మాసనం స్పందిస్తూ బాధితులు చిన్నపిల్లలని.. కేసును త్వరగా ముందుకు తీసుకెల్లాలని ఆదేశించింది. పోక్సో చట్టం ప్రకారం.. బాలికల విచారణ సమయంలో ఓ మహిళా ప్రాసిక్యూటర్ హాజరు కావాలని బెంచ్ ఆదేశించింది. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సహాయం చేసేందుకు మహిళా ప్రాసిక్యూటర్‌ను నియమించినట్లు తెలిపారు.
కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు కేసు స్టేటస్‌ను ప్రాసిక్యూషన్‌కు తెలపాలని చెప్పింది. గతేడాది పాఠశాలలు, విద్యాసంస్థల్లో పిల్లల భద్రతను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే, కమిటీ సిఫారసులపై నివేదికను సమర్పించాలని ఉందని పీపీ ధర్మాసనానికి విచారణ సందర్భంగా వెల్లడించారు. రాబోయే విచారణ తేదీ నాటికి నివేదికను సమర్పిస్తే.. పరిశీలిస్తామని చెప్పింది. ఈ కేసులో నిందితుడి ఎన్‌కౌంటర్‌పై తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణ జరుగనున్నది. తన కొడుకును పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ చేశారని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం ఈ నెల 20న హైకోర్టు విచారించనున్నది.