ముంబై, జూలై 21 (నమస్తే తెలంగాణ) : దేశం యావత్తు షాక్కు గురైన 2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం (2015లో) ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ మొత్తం 12 మందిని నిర్దోషులుగా తేల్చింది. మరే ఇతర కేసులు వారిపై లేనట్టయితే.. వారందర్నీ విడుదల చేయాలని ఆదేశించింది. దోషులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు సమర్పించటంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని , దోషులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నట్టు బెంచ్ పేర్కొన్నది.
హైకోర్టు నుంచి వెలువడిన ఈ తీర్పు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2006 జూలై 11న ముంబైలోని పలు రైల్వే స్టేషన్లో ఏడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మాతుంగా రోడ్, మహీం జంక్షన్, బాంద్రా, ఖార్ రోడ్, జోగేశ్వరి, భయాందర్, బోరివలి స్టేషన్ల సమీపంలో అవి పేలాయి. ఈ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్పుపై అప్పీల్ చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.