ముంబై: స్కూల్ బాలికలపై లైంగిక వేధింపుల కేసు నిందితుడి ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. (Badlapur Accused Death) అతడి మరణాన్ని ఎన్‌కౌంటర్‌గా భావించలేమని పేర్కొంది. పోలీసుల వాదన అంగీకరించడం చాలా కష్టమని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో ఒక స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ షిండే ఇద్దరు బాలికలను టాయిలెట్లో లైంగికంగా వేధించాడు. అతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం తలోజా జైలు నుంచి బద్లాపూర్‌కు తీసుకెళ్తుండగా పోలీస్ అధికారి నుంచి పిస్టల్ లాక్కొని కాల్పులు జరిపినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో అక్షయ్ షిండే మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, తన కుమారుడ్ని బూటకపు ఎన్కౌంటర్లో చంపారని అక్షయ్ షిండే తండ్రి ఆరోపించాడు. ఆ పోలీసులపై కేసు నమోదు చేయాలని, ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ జరిపింది. అక్షయ్ షిండే కస్టడీ మృతిపై పోలీసులను నిలదీసింది.
మరోవైపు నిందితుడి కాళ్లు లేదా చేతులపై కాకుండా నేరుగా తలపై ఎందుకు కాల్చారు? అని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ‘నిందితుడు వీక్‌గా ఉన్నాడు. అతడ్ని మీరు (పోలీసులు) అధిగమించలేరని ఎలా నమ్ముతాం? శిక్షణ పొందితే తప్ప సామాన్యుడు పిస్టల్ లాక్ తీసి కాల్చలేడు. మూడు బుల్లెట్లు ఫైర్ చేస్తే ఒక బుల్లెట్ వల్ల పోలీస్‌కు గాయమైందని అంటున్నారు. మిగతా రెండు బుల్లెట్లు ఏవి? పోలీస్ వాదన అంగీకరించలేం. దీనిని ఎన్‌కౌంటర్‌గా భావించలేం’ అని ధర్మాసనం పేర్కొంది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు హెచ్చరించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.