ముంబై, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలోని రోడ్ల దుస్థితి, గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్హోళ్ల వల్ల ప్రమాదాలు, మరణాలపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సురక్షితమైన రోడ్లను పొందడం సామాన్యుడి ప్రాథమిక హకు అని స్పష్టం చేసింది. గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వారి వారసులకు, గాయపడిన వారికి పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. గుంతలు, తెరిచి ఉన్న మ్యాన్ హోళ్ల కారణంగా మరణించిన వారి వారసులకు రూ.6 లక్షలు, గాయపడిన వారికి వారి గాయాల స్వభావం, తీవ్రతను బట్టి రూ.50వేల నుంచి రూ.2.5 లక్షల వరకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
రోడ్లపై గుంతలు, నాసిరకం పనులు కనిపిస్తే, ఏ సందర్భంలోనైనా 48 గంటల్లోపు వాటిని మరమ్మతు చేయడం తప్పనిసరి అని పేర్కొంది. నాసిరకం పనులు కనిపిస్తే, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేయడం, జరిమానా విధించడం,క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించింది. అలాగే, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. టోల్, ఇతర ఆదాయాల ద్వారా సాధారణ ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తారు, కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.