Bomb Threats : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని 10 విదేశీ రాయబార కార్యాలయాలకు, డీజీపీ ఆఫీస్కు బాంబు బెదిరింపు (Bomb Threats) మెయిల్స్ రావడం కలకలం రేపింది. మంగళవారం చెన్నైలోని తేనాంపేట (Thenampet) లోని అమెరికా కాన్సులేట్ సహా సింగపూర్, కొరియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్ తదితర ఎంబసీలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
కరూర్ తొక్కిసలాట ఘటన, డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావిస్తూ వేర్వేరు ఈ-మెయిల్ ఐడీలతో డీజీపీ కార్యాలయానికి ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అన్ని కాన్సులేట్లలో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్వాడ్ల సాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెన్నై పోలీసులు చెప్పారు.
కాన్సులేట్ల చుట్టూ భద్రతను పెంచినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. 200ల మంది ప్రయాణికులు ఉన్న విమానం గాల్లో ఉండగా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన ఎయిర్లైన్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చారు. పైలట్లు విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేసిన అనంతరం తనిఖీలు చేపట్టగా ఎలాంటి బాంబు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.