గాంధీనగర్: ఒక రాష్ట్ర అసెంబ్లీ, కోర్టుతో పాటు పలు స్కూళ్లకు ఒకే రోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయా ప్రాంగణాలను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్లతో సోదాలు చేశారు. బెదిరింపు సందేశాలు, ఈమెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Bomb Threats Target Gujarat) గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ, గాంధీనగర్ కోర్టు, అహ్మదాబాద్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చాయి. గుజరాత్ అసెంబ్లీని పేల్చివేస్తామని బెదిరిస్తూ ఉదయం 8 గంటల సమయంలో ఒక ఈమెయిల్ అందింది. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్లు తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.
అనంతరం గాంధీనగర్ జిల్లా, సెషన్స్ కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగులు, కోర్టులోని ఇతర వ్యక్తులను అక్కడి నుంచి తరలించారు. బాంబ్ స్క్వాడ్‌తో సోదాలు చేశారు. బెదిరింపు ఈమెయిల్ విదేశాల నుంచి వచ్చినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆరు నెలల కిందట కూడా ఇలాంటి బెదిరింపు వచ్చిందని చెప్పారు.
మరోవైపు అహ్మదాబాద్‌లోని మూడు పాఠశాలకు కూడా బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. వేజల్పూర్లోని జైడస్ స్కూల్, బోపాల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తల్తేజ్‌లోని ఉద్గం స్కూల్‌కు బెదిరింపు ఈమెయిల్స్ అందాయి. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ, 108 అత్యవసర అంబులెన్స్ బృందాలు ఆయా స్కూల్స్‌కు చేరుకున్నాయి. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని అధికారులు తెలిపారు.
అయితే ముందుజాగ్రత్త చర్యగా జైడస్ స్కూల్ విద్యార్థులను ఇంటికి పంపించివేశారు. పిల్లలను పాఠశాల నుంచి తీసుకువెళ్లమని వారి తల్లిదండ్రులను కోరారు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. గురువారం వరుసగా అసెంబ్లీకి, కోర్టుకు, పలు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు రావడంతో గుజరాత్ వ్యాప్తంగా భయాందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెదిరింపు ఈమెయిల్స్ మూలాలు, వాటిలోని అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.