న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 150కి పైగా పాఠశాలలకు బుధవారం ఈమెయిల్స్‌లో బాంబు బెదిరింపులు వచ్చాయి. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టి, నకిలీ బాంబు బెదిరింపులుగా తేల్చటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపు ఈమెయిల్స్ ఎక్కడ్నుంచి పంపారన్నది గుర్తించామని, దీని వెనుకున్న కుట్రదారులను కఠినంగా శిక్షిస్తామని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా చెప్పారు.
ఈ బాంబు బెదిరింపులతో నగరంలో పిల్లల తల్లిదండ్రులంతా పాఠశాలలకు పరుగులు తీశారు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్‌స్కాడ్ సిబ్బంది తనిఖీలు జరిపాయి. బాంబు బెదిరింపు ఈమెయిల్స్ ఒకే చోట నుంచి వచ్చాయని, ఐపీ అడ్రస్‌ను బట్టి రష్యా నుంచి ఓ వ్యక్తి ఈ బెదిరింపు మెయిల్స్ పంపినట్టు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.