Bomb threat : కేరళ (Kerala) లో గత రెండు రోజులుగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతున్నది. తాజాగా కేరళ సీఎం కార్యాలయానికి, సీఎం నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్స్ (Bomb threat mails) వచ్చాయి. సీఎం కార్యాలయాన్ని, ఆయన నివాసం క్లిఫ్ హౌస్ (Cliff house) ను బాంబులతో పేల్చివేస్తామని ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దాంతో భద్రతా సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ (Bomb squad) రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
క్షుణ్ణంగా తనిఖీలు చేసి సీఎం కార్యాలయంలోగానీ, క్లిఫ్ హౌస్లోగానీ బాంబులేమీ లేవని తేల్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆదివారం కూడా తిరువనంతపురం ఎయిర్పోర్టులో బాంబులు పెట్టామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో భద్రతాసిబ్బంది అప్రమత్తమై తనీఖీలు చేసి బాంబులేమీ లేవని తేల్చారు.
ఆ తర్వాత కాసేపటికే తిరువనంతపురం రైల్వేస్టేషన్లో బాంబులు పెట్టామని మరో మెయిల్ వచ్చింది. అది కూడా ఆకతాయి మెయిలేనని పోలీసులు తేల్చారు. తాజాగా ఇవాళ సీఎం కార్యాలయంలో, నివాసం భవనంలో బాంబులు పెట్టామంటూ మరో మెయిల్ వచ్చింది.