Kangana Ranaut | బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పంజాబ్ మొహాలీలోని జిరాక్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారి కుల్విందర్ చర్యను సమర్థించాడు. ఆమెకు లక్ష రూపాయల రివార్డును ప్రకటించారు. కాగా, ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ కూడా స్పందించారు. ఆ మహిళా కానిస్టేబుల్‌కు ఉద్యోగం ఇచ్చేందుకు తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు.
‘ నేను హింసను ఎప్పుడూ సమర్థించను. కానీ సీఎఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. ఒకవేళ ఆ అమ్మాయిపై ఏదైనా చర్య తీసుకుంటే.. ఆమె ఉద్యోగం పోతే నేను జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. జైహింద్.. జై జవాన్ – జై కిసాన్ ‘ అంటూ విశాల్ దద్లానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రాసుకొచ్చారు. ఆ తర్వాత కుల్విందర్ కౌర్‌ను సపోర్టు చేస్తూ చాలామంది పోస్టులు చేస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన కంగనా రనౌత్ చండీగఢ్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా అక్కడ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంప చెళ్లుమనిపించింది. వంద రూపాయలకే రైతులు ధర్నాలో పాల్గొంటారంటూ గతంలో కంగనా చేసిన విమర్శల నేపథ్యంలో దాడి చేశానని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెప్పింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆనాడు జరిగిన ధర్నాలో తన తల్లి పాల్గొన్నదని, నిరసన తెలుపుతున్న ఆమెపై అలా మాట్లాడటం తట్టుకోలేకనే కంగనా చెంప పగలగొట్టానని తెలిపింది. కాగా, ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన సీఐఎస్ఎఫ్.. కుల్విందర్‌ను సస్పెండ్ చేసింది. ఆమెపై కేసు కూడా నమోదు చేసి అరెస్టు చేశారు.