Boat accident : ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల బోట్లు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ ప్రమాదాలు తీరప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా తొండంగి వద్ద సముద్ర తీరంలో ఓ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎల్లయ్యపేట గ్రామానికి చెందిన ఎరుపల్లి కోటేశ్, ఎరుపల్లి ప్రసాద్ అనే ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు.
వీరంతా మరికొంతమందితో కలిసి సముద్రంలో సుమారు 15 కిలోమీటర్ల దూరం వరకు చేపల వేటకు వెళ్లారు. అక్కడ భోజనం వండుకునేందుకు బోటులో గ్యాస్ స్టవ్ ఆన్ చేయగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగి పడవ మొత్తానికి వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు మత్స్యకారులంతా సముద్రంలోకి దూకేశారు. అయినా ఇద్దరికి మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరగగానే సమీపంలోనే వేరే బోటులో ఉన్న తోటి మత్స్యకారులు దీనిని గమనించి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ రక్షించారు. తీవ్రంగా గాయపడిన కోటేశ్, ప్రసాద్లను వెంటనే తునిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఒక బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కాగా.. మరో బోటు ప్రమాదంలో 10 మందిని సురక్షితంగా కాపాడిన సంగతి తెలిసిందే.