Vinod Tawde- BJP | మహారాష్ట్రలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వివాదంలో చిక్కుకున్నారు. ఓటర్లకు మనీ పంపిణీ చేస్తూ దొరికిపోవడంతో వివాదస్పదంగా మారింది. పాల్ఘార్ జిల్లాలోరి విరార్ లో గల ఒక హోటల్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినోద్ తావ్డే క్యాష్ పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాదీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ ఆరోపణలు చేయడంతో ఈ సంగతి బయట పడింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది.
ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే వచ్చారని, ఆయన ఓటర్లకు రూ.5 కోట్లు పంచడానికే వచ్చారని స్థానిక బీజేపీ నేతలు తనకు చెప్పారని హితేంద్ర ఠాకూర్ చెప్పారు. ఒక జాతీయ నాయకుడ్ని తాను నిలువరించలేకపోయానన్నారు. ఆయన్ను ఒక హోటల్ లో చూశానని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి వినోద్ తావ్డే, బీజేపీలపై చర్య తీసుకోవాలని కోరారు. వినోద్ తావ్డే బస చేసిన హోటల్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డింగ్ నిలిపేశారని హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. దీంతో బీజేపీతోనూ, వినోద్ తావ్డేతోనూ హోటల్ యాజమాన్యం చేతులు కలిపినట్లు కనిపిస్తున్నదన్నారు. తాము రిక్వెస్ట్ చేసిన తర్వాత సదరు సీసీటీవీ కెమెరాలను యాక్టివేట్ చేశారని హితేంద్ర ఠాకూర్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వినోద్ తావ్డేపై కేంద్ర ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. అయితే, నగదు పంపిణీ చేశారన్న ఆరోపణలపై కేసు పెట్టలేదు. ఈ ఆరోపణలను వినోద్ తావ్డే తోసిపుచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్నారు.