Arrest Warrant for Bagga | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత తేజిందర్ పాల్ బగ్గాపై పంజాబ్‌లోని మొహాలీ కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, నేరపూరితంగా బెదిరింపులకు పాల్పడం వంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ ఐపీసీలోని 153-A, 505, 505 (2), 506 సెక్షన్ల కింద బగ్గాపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బగ్గా అరెస్ట్‌కు వారంట్ జారీ చేయాలని శనివారం మొహాలీ కోర్టును ఆశ్రయించగా, అతడ్ని అరెస్ట్ చేయాలని న్యాయస్థానం వారంట్ జారీ చేసింది.
శుక్రవారం ఢిల్లీలో తేజిందర్ పాల్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీనిపై బగ్గా తండ్రి తన కొడుకును కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు సెర్చ్ వారంట్ తీసుకున్నారు.
మధ్యలో హర్యానాలోని కురుక్షేత పోలీసులు.. పంజాబ్ పోలీసులను అడ్డుకుని తేజిందర్ బగ్గాను విడిపించారు. పంజాబ్ పోలీసులను కురుక్షేత్ర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు తమ వద్ద నున్న సెర్చ్ వారంట్‌తో బగ్గాను తీసుకెళ్లిపోయారు. అటుపై ఢిల్లీలోని ద్వారక మేజిస్ట్రేట్ కోర్టు.. బగ్గాను విడుదల చేయాల్సిందిగా ఆదేశించడంతో ఆయన ఇంటికెళ్లిపోయారు.
ఢిల్లీ, పంజాబ్‌లలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తున్నది. కానీ ఢిల్లీలోని పోలీసు యంత్రాంగం పూర్తిగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో పని చేస్తుంది. గత మార్చి 30న కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ పోలీసులు గత నెల ఒకటో తేదీన కేసు నమోదు చేశారు. కేజ్రీవాల్ నివాసం ముందు బీజేవైఎం నిరసనలో ఆయనపై బగ్గా తీవ్ర ఆరోపణలు చేశారు.