BJP | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రధాని మోదీ మిత్రుడు అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాలపై అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు’ సంచలన విషయాలు బయటపెట్టిన రోజే.. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కేంద్రం ప్రకటన.. ఆ తర్వాతి రోజే జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు లీక్.. పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు పెడుతున్నట్టు మరో లీక్.. దానిపై చర్చ కొనసాగుతుండగానే బీసీ వర్గాలను సబ్ క్యాటగిరీలుగా విభజించనున్నట్టు ఇంకో లీక్.. ప్రజలంతా ఈ అంశాలపై కిందా మీదా పడుతుండగానే.. ఏకంగా దేశం పేరునే ఇండియాకు బదులు భారత్‌గా మారుస్తున్నట్టు ఇంకో లీక్.. ఇంకేముంది మోదీ హయాంలో నిరుద్యోగం, పెరిగిన ధరలు, మతహింస, మణిపూర్ హింస, సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, కార్పొరేట్ కుంభకోణాలు.. ఇలా అన్నింటినీ ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడు చర్చంతా దేశంపేరు మార్పు, స్పెషల్ పార్లమెంటు చుట్టే తిరుగుతున్నది. సరిగ్గా మోదీ సర్కారు కూడా ఆశించింది అదే.. ప్రజల్లో భావోద్వేగాలు ఎంత హెచ్చుస్థాయిలో మేల్కొంటే.. ప్రభుత్వ వైఫల్యాలు అంత మరుగున పడిపోతాయి. ఎన్నికలవేళ బీజేపీ విసిరిన పాచిక ఇది..
దృష్టి మళ్లింపులో సూపర్ సక్సెస్
ఎన్నికలవేళ ప్రజలు, మీడియా దృష్టి మళ్లించే చరిత్ర బీజేపీకి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మతం, కులం పేరుతో ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం షరామామూలేనని చెప్తున్నారు. కానీ, ఈసారి బీజేపీ ఈ విషయంలో వ్యూహం మార్చినట్టు కనిపిస్తున్నదని అంటున్నారు. కొద్దిరోజులుగా ఒక్కో అంశంపై లీకులిస్తూ వస్తున్న కేంద్రం, మంగళవారం ఏకంగా దేశం పేరునే మార్చుతున్నట్టు లీకిచ్చింది. మీడియా, ప్రజలతోపాటు మేధావులు ఈ అంశంపైనే చర్చ మొదలుపెట్టారు. దేశంలో యువ ఓటర్లే అధికంగా ఉన్నారు. సహజంగానే వీరు సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. దీంతో ఇలాంటి విషయాల్లో అతిగా స్పందిస్తూ తీవ్ర చర్చకు తెరతీస్తారు. స్పెషల్ పార్లమెంటు ఇందుకేనా?
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించడంతో ప్రజలతోపాటు ప్రతిపక్షాలు కూడా విస్తుపోయాయి. వర్షాకాల సమావేశాలు ముసిగి మూడు వారాలు గడువకముందే మరోసారి సమావేశాలు ఎందుకో ఎవరికీ అర్థంకాలేదు. ఈ సమావేశాల ఎజెండాపై గోప్యత పాటించటంతో మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. దేశంలో జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు చేయబోతున్నారని కొందరు, మహిళా బిల్లుపై చర్చ చేపట్టబోతున్నారని మరికొందరు, బీసీ వర్గాలను సబ్ క్యాటగిరీలుగా విభజించబోతున్నారని ఇంకొందరు.. ఇలా విశ్లేషించటం మొదలుపెట్టారు.
అయినా ఇప్పటివరకు కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాలు ఎందుకోసమో ఒక్క మాట కూడా చెప్పలేదు. దీనిపై ఊహాగానాలు మాత్రం ఆగలేదు. 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు అని మాత్రం కేంద్రం ఓ మాట చెప్పింది. ఐదురోజులపాటు సాగే ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంటులో ప్రారంభమై, కొత్తపార్లమెంటులో ముగుస్తాయని ప్రహ్లాద్‌జోషీ చెప్పారు. పాత పార్లమెంటు భవనంలో జరిగే రెండురోజుల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో వైఫల్యాలను మోదీ సర్కారు ఎండగట్టనున్నట్టు ప్రచారం సాగుతున్నది. కొత్త భవనంలో జరిగే మూడు రోజుల సమావేశాల్లో మోదీ సర్కారు విజయాలను ఏకరువు పెట్టనున్నారని చెప్తున్నారు. దీంతోపాటు 2047 వరకు దేశ అభివృద్ధిపై బీజేపీ ప్రకటించిన విజన్‌పై కూడా చర్చ ఉంటుందని అంటున్నారు.
ప్రచారాస్త్రంగా దేశం పేరు మార్పు?
రాజ్యాంగంలోని మొదటి అధికరణంలో మన దేశం పేరును ‘INDIA, THAT IS BHARAT, SHALL BE A UNION OF STATES’ అని పేర్కొన్నారు. అంటే.. రాజ్యాంగ కర్తలు ఇండియాతోపాటు భారత్ అని కూడా స్పష్టంగానే చెప్పారు. దేశంలో చాలామంది భారత్, భారతదేశం అనే పేర్లనే వాడుతున్నారు కూడా.. అంతర్జాతీయ స్థాయిలోనే ఇండియా అనే పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అధికారిక పత్రాల్లో ఇండియా అనే ఉంటుంది. మోదీ సర్కారు ఉన్నట్టుండి అధికారిక పత్రాల్లో ఇండియాను తీసేసి భారత్ అని చేర్చింది. జీ20 సమావేశాల ఆహ్వానితులకు ‘THE PRESIDENT OF BHARAT’ పేరుతో ఆహ్వాన పత్రాలు పంపటం తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ దెబ్బకు ప్రజలు, మీడియా జమిలి ఎన్నికలను కూడా మర్చిపోయి దేశం పేరు మార్పుపై పడ్డాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశం పేరు మార్పును బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకొనే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశం పేరు మార్పును వ్యతిరేకించేవారిని జాతి వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చిత్రంచే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ను సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ కావాలని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. రాష్ర్టాల అసెంబ్లీల ఆమోదం కూడా అవసరం పడొచ్చు. అప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలు ఆమోదం తెలుపటం ఖాయం.
కానీ, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది. అప్పటికి ఎన్నికలు మరింత దగ్గరపడుతాయి. దీనిని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని తామే దేశభక్తులమనేలా ప్రచారం చేసుకొనే అవకాశం ఉన్నదని నిపుణులు పేర్కొంటున్నారు. కొద్దిరోజుల నుంచి మోదీ సర్కారు తీసుకొంటున్న చర్యలన్నీ రాజకీయంగా దేశాన్ని స్పష్టంగా రెండుగా చీల్చేందుకేనని భావిస్తున్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల అవసరాలు, అభివృద్ధి, సంక్షేమం వంటివి చర్చకు రాకుండా చేయటమే బీజేపీ లక్ష్యమని విశ్లేషిస్తున్నారు.
జమిలి ఎన్నికలకు పావులు!
జమిలి ఎన్నికలపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ప్రత్యేక సమావేశాల్లో జమిలి కోసం రాజ్యాంగ సవరణలు కూడా ఉండొచ్చనే చర్చ జరుగుతున్నది. ఐడీఎఫ్సీ ఇన్స్టిట్యూట్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో జమిలి ఎన్నికలు జాతీయ పార్టీలకే లాభిస్తున్నాయని తేలింది. మోదీ సర్కారు కూడా ఇదే ఆశతో ఉన్నట్టు మేధావులు పేర్కొంటున్నారు. జమిలి ఎన్నికల్లో 71 శాతం జాతీయ పార్టీలకే విజయం దక్కిందని ఐడీఎఫ్సీ సర్వేలో తేలింది. మోదీ సర్కారుపై ప్రజల్లో ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. జమిలి ఎన్నికలు నిర్వహిస్తేనే మరోసారి అధికారంలోకి రావొచ్చే ఉద్దేశంలో బీజేపీ ఉన్నట్టు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కానీ, దీనిపై కేంద్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. జమిలి ఎన్నికలపై కోవింద్ నేతృత్వంలో ఇప్పటికే కమిటీ వేసింది. ‘వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండి’ అని ఆదేశించింది.