కోదాడ, డిసెంబర్ 30 : ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ ఎస్ వీ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎన్ ఆర్ ఎస్ ఐ ఐ టీ & మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోదాడ వంటి పట్టణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తయారు చేస్తున్న ఎన్ ఆర్ ఎస్ అకాడమీ కృషి అభినందనీయమన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ రూరల్ ప్రాంత విద్యార్థులు సరైన ఫౌండేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్మీడియట్ లో రాణించలేక పోతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ ఆర్ ఎస్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించడం హర్షణీయమన్నారు.
అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన తాను సరైన ఫౌండేషన్ లేక పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ అకాడమీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా పాఠశాలను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, అకాడమీ అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, అకాడమీ కరస్పాండెంట్ వేణుగోపాల్ రావు, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, ప్రిన్సిపాల్ గంధం వెంకటరమణ (జీవీ), వైస్ ప్రిన్సిపాల్ పి.నాగేశ్వర్రావు(పీఎన్ఆర్), ఏఓ మౌనిక, పీఆర్ఓ మల్లికార్జున్ పాల్గొన్నారు.