Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారం పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. తాను నిజాయితీపరుడినని ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చేవరకూ సీఎం పగ్గాలు చేపట్టబోనని చెప్పారు. ఇక కేజ్రీవాల్ ప్రకటన పబ్లిసిటీ స్టంట్, ఎన్నికల ఎత్తుగడ మాత్రమేనని కాంగ్రెస్, బీజేపీలు తప్పుపట్టాయి.
ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేజ్రీవాల్ చేసిన ప్రకటన పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, తన ఇమేజ్ను కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనని బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి అన్నారు. ఢిల్లీ వాసుల్లో కేజ్రీవాల్ అవినీతిపరుడనే ముద్ర పడుతోందని గ్రహించినందునే దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక కేజ్రీవాల్ సీఎం పదవి నుంచి తప్పుకోవడం త్యాగమేమీ కాదని, సీఎం కార్యాలయంలోకి తిరిగి ప్రవేశం, ఫైళ్లపై సంతకాలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత మణిందర్ సింగ్ సిర్సా పేర్కొన్నారు. తదుపరి సీఎంగా తన భార్య సునీతా కేజ్రీవాల్‌ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను ఒప్పించేందుకే సీఎం రెండు రోజుల గడవుతు తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇక సీఎం నిర్ణయం కేవలం ప్రచార ఎత్తుగడని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అభివర్ణించారు. ఆయన ఎప్పుడో రాజీనామా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత సీఎంఓకు తిరిగివచ్చి ఫైళ్లపై సంతకాలు చేయరాదని ఓ సీఎంను సుప్రీంకోర్టు కోరడం ఇదే తొలిసారని గుర్తుచేశారు. ఆధారాలను మాయం చేసే అవకాశం ఉందనే కోర్టు ఆందోళన ఈ ఉత్తర్వుల్లో కనిపిస్తోందని అన్నారు. కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు నేరస్తుడిగా పరిగణిస్తున్నదని ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఈనెల 13న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Read More :
Vande Bharat trains | కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ