న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. ఈ నేపథ్యంలో భర్త గెలుపుపై ఆయన భార్య స్వాతి సింగ్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. (Parvesh Verma’s Wife) పర్వేష్ వర్మలో ఉన్న మూడు ప్రధాన గుణాలు న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్‌పై పోటీకి తన భర్తను బీజేపీ ఎంచుకోవడానికి కారణమని అన్నారు. ‘కష్టపడి పనిచేసే స్వభావం. ఏదైనా నిర్ణయించుకుంటే దానిని పూర్తి చేసే నైజం. అవినీతి రహితంగా పనిచేయడం’ తన భర్తలో ఉన్న ఈ మూడు లక్షణాలు అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు చేర్చాయని తెలిపారు. చాలా మంది ఇతర రాజకీయ నాయకుల నుంచి ఆయనను భిన్నంగా ఉంచాయని చెప్పారు.
కాగా, ఢిల్లీ ప్రజలు మార్పుతోపాటు వేరే ప్రభుత్వాన్ని కోరుకున్నారని స్వాతి సింగ్ వర్మ తెలిపారు. ‘ప్రజలు మార్పు మూడ్‌లో ఉన్నారు. వారు వేరే ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఢిల్లీని వేరే ప్రదేశంగా మార్చగల ప్రభుత్వాన్ని వారు కోరుకున్నారు. గత 11 సంవత్సరాలుగా తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు కథనాలతో వారు మోసపోయారు. కానీ ఇప్పుడు (ప్రధాని) మోదీ ఢిల్లీకి వచ్చి, నివసించడానికి అందమైన ప్రదేశంగా మార్చడానికి సహాయం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని అన్నారు.
మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ సీఎం రేసులో ఉండటంపై మాజీ కేంద్ర మంత్రి విక్రమ్ వర్మ కుమార్తె అయిన ఆయన భార్య స్వాతి సింగ్ వర్మ స్పందించారు. ‘కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా ‘ఢిల్లీ అభివృద్ధి కోసం’ ఆయన పనిచేస్తారు’ అని అన్నారు. గతంలో మాదిరిగానే భర్త విజయం కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేసిన సంగతిని ఆమె గుర్తు చేశారు.