Arvind Kejriwal – Parvesh Verma | త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీద పోటీ చేస్తానని బీజేపీ నేత, మాజీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ చెప్పారు. న్యూఢిల్లీ సీటు నుంచి తనను అభ్యర్థిగా ఎంపిక చేయాలని బీజేపీని కోరారు. ఇప్పటికే కేజ్రీవాల్‌పై ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధం అని ప్రకటించారు. మరో మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ కూడా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆ సీటుపై భారీ అంచనాలు నెలకొంటాయని భావిస్తున్నారు.
‘అరవింద్ కేజ్రీవాల్‌ను 11 ఏండ్లుగా ఢిల్లీ ప్రజలు నమ్మి ఆయనకు ఓటేశారు. కానీ వారికి ఆయన ద్రోహం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ గల్లంతయ్యేలా ఢిల్లీ ప్రజలు గుణపాఠం నేర్పనున్నారు’ అని పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ తెలిపారు.
ఆదివారం ఆప్ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. న్యూఢిల్లీ సీటు నుంచి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తానని పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అరవింద్ కేజ్రీవాల్ తనను తాను సామాన్యుడినని చెప్పుకోవద్దన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తన బంగళా మరమ్మతుల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. మురికివాడల ప్రజలకు వసతులు కల్పిస్తేనే ఆమ్ ఆద్మీ అవుతారని పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ అన్నారు. 2013, 2015 ఎన్నికల్లో షీలా దీక్షిత్‌ను ఓడించిన అరవింద్ కేజ్రీవాల్.. 2020 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్‌ను ఓడించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.