చండీగఢ్: డేరా సచ్చా సౌదా చీఫ్, అత్యాచారం కేసులో దోషి అయిన గుర్మీత్ రామ్ రహీమ్‌కు ఆరుసార్లు పెరోల్ మంజూరు చేసిన జైలు అధికారి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు జైలు అధికారి పదవికి రాజీనామా చేసిన సునీల్ సాంగ్వాన్ (Sunil Sangwan) బీజేపీలో చేరారు. దాద్రీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, కాంగ్రెస్ అభ్యర్థి మనీషా సాంగ్వాన్‌పై 1,957 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సీటును బీజేపీ గెలుచుకోవడం ఇదే తొలిసారి. 2014లో స్వతంత్ర అభ్యర్థి అయిన సోమ్‌వీర్ సంగ్వాన్ దాద్రీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2009లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కు చెందిన రాజ్‌దీప్ ఫోగట్ ఈ సీటును దక్కించుకున్నారు.
కాగా, డేరా సచ్చా సౌదా చీఫ్, అత్యాచారం కేసులో దోషి అయిన గుర్మీత్ రామ్ రహీమ్‌కు గత రెండేళ్లలో పదిసార్లు పెరోల్ ఇచ్చారు. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో 21 రోజులు పెరోల్ మంజూరైంది. అలాగే అక్టోబర్ 5న జరిగిన హర్యానా పోలింగ్‌లో ఓటు వేసేందుకు రామ్ రహీమ్‌ను అక్టోబరు 2న జైలు నుంచి విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ఓటు వేయాలని ఆరు జిల్లాల్లో విస్తరించిన తన మద్దతుదారులు, అనుచరులకు ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు హర్యానాలో బీజేపీ హాట్రిక్ విజయానికి రామ్ రహీమ్ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే ఆయనను ఎన్నికల సమయంలో జైలు నుంచి విడుదల చేయడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల కమిషన్ (ఈసీ)కి ఈ మేరకు ఫిర్యాదు చేసింది.