దుమ్కా: జార్ఖండ్‌లోని దుమ్కా లోక్‌సభ స్థానానికి జరిగిన పోలింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీతా సోరెన్(Sita Soren) పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ సీఎం హేమంత్ సోరెన్ మేనకోడలైన సీతా.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియను కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపించారు. దుమ్కా అర్బన్‌లో అనేక బూత్‌లకు వెళ్లానని, అక్కడ అక్రమ పద్థతిలో ఓటింగ్ జరుగుతున్నట్లు తేలిందని, ఈ విషయాన్ని డిప్యూటీ కమీషనర్‌కు వెల్లడించానని, అనుభవం లేని బీఎల్వోల వల్ల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీతా సోరెన్ తెలిపారు. కావాలనే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నారని, ఈ విషయంపై ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని, రీ పోలింగ్ నిర్వహించాలని కోరనున్నట్లు సీతా సోరెన్ తెలిపారు.
గతంలో మూడుసార్లు జేఎఎం ఎమ్మెల్యేగా సీతా సోరెన్ విజయం సాధించారు. అయితే ఇటీవల ఆ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరారు. ఆమె భర్త దుర్గా సోరెన్ 2009లో మరణించారు. సీతా సోరెన్ చేసిన ఆరోపణలను సీఈవో రవి కుమార్ ఖండించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు.