BJP | న్యూఢిల్లీ, మార్చి 31: ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారంతా అవినీతిపరులు. పార్టీలోకి వచ్చాక వారే ఆదర్శవంతులు. అవతలి పార్టీలో ఉంటే వారిపై నిందారోపణలు. కాషాయ కండువా కప్పుకున్నాక వారికే నీరాజనాలు. లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ మార్క్ రాజకీయమిది. గతంలో అవినీతిపరులని ఆరోపించిన నేతలనే రెడ్‌కార్పెట్ పరిచి పార్టీలోకి చేర్చుకుంటున్నది. బీజేపీ కండువా కప్పేసి పునీతులను చేసేస్తున్నది. పార్టీ టికెట్లు కేటాయిస్తున్నది.
ఆఖరికి పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను కూడా చేసేస్తున్నది. అజిత్ పవార్ మొదలుకొని నవీన్ జిందాల్ వరకు గతంలో బీజేపీ చేత అవినీతిపరులుగా ముద్ర వేయించుకున్న నేతలంతా ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న రాజకీయ విశ్లేషకులు… బీజేపీని వాషింగ్ మెషీన్‌తో పోలుస్తున్నారు. ఎన్ని మరకలున్న దుస్తులైనా ఒకసారి వాషింగ్ మెషీన్లో వేస్తే శుభ్రమైనట్టు బీజేపీలో చేరిన నేతలు కూడా మంచి వారు అయిపోతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
మహారాష్ట్ర బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా అజిత్
ఎన్సీపీలో చీలిక తెచ్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్‌ను ఈ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీజేపీ చేర్చింది. గతంలో ఆయనపై బీజేపీ అనేక ఆరోపణలు చేసింది. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.25 వేల కోట్ల కుంభకోణం కేసు కూడా ఆయనపై ఉండేది. అయితే, బీజేపీతో జట్టుకట్టిన తర్వాత ఈ కేసులో అజిత్ పవార్‌కు పోలీసు శాఖ క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇదే ఎన్సీపీని 2014లో ప్రధాని మోదీ.. నేచురల్ కరప్షన్ పార్టీగా నిర్వచించారు.
మరో స్టార్ క్యాంపెయినర్ ‘ఆదర్శ్’ అశోక్ చవాన్
మహారాష్ట్రలోనే ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్‌ను రాజ్యసభ సభ్యుడిని చేయడంతో పాటు పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ నియమించింది. ఆదర్శ్ కుంభకోణంలో చవాన్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును ఈడీ విచారిస్తున్నది. గతంలో అనేకసార్లు చవాన్‌ను బీజేపీ అవినీతిపరుడని విమర్శించింది. 2014లోనైతే చవాన్‌కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్‌కు సిగ్గులేదని మోదీ నిందించారు.
కండువా కప్పుకోగానే నవీన్ జిందాల్‌కు టికెట్
ఇటీవల కాంగ్రెస్ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ బీజేపీలో చేరగా, గంటల వ్యవధిలోనే ఆయనకు కురుక్షేత్ర ఎంపీ టికెట్ ఇచ్చారు. జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలు నవీన్‌పై ఉన్నాయి. సీబీఐ, ఈడీ కూడా విచారించింది. ఈ బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించి మోదీ గతంలో అనేక ఆరోపణలు చేశారు. జార్ఖండ్ గనులు లూటీ కాకుండా చేస్తానని ఆయన ప్రకటించారు.
గీతా కొడాకు కండువా కప్పేశారు
బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో అవినీతి ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతా కోడాను ఇటీవల పార్టీలో చేర్చుకుంది బీజేపీ. ఆమెకు సింఘ్‌భుమ్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. గీతా కోడా 2018లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై అనేక విమర్శలు చేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేస్తున్నారని, మధు కోడా చేసిన కుంభకోణంలో కాంగ్రెస్ నేతలకూ పాత్ర ఉన్నదని ఆరోపించారు.
‘దొంగ’ అన్న నేతకే టికెట్
పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత తపస్ రాయ్‌ను ఇటీవల బీజేపీలో చేర్చుకుని కోల్‌కతా నార్త్ ఎంపీ టికెట్ ఇచ్చారు. మున్సిపాలిటీ ఉద్యోగ నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై ఆయనపై ఈడీ విచారణ జరిపింది. ఆ సమయంలో బెంగాల్ బీజేపీ కీలక నేత సువేంధు అధికారి.. తపస్ రాయ్‌ను ‘దొంగ’ అని విమర్శించారు.ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతి ఆరోపణలు ఉన్న, సీబీఐ, ఈడీ, ఐటీ తదితర దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొన్న ఎంతో మంది నేతలను పార్టీలోకి చేర్చుకొని మంచి ప్రాధాన్యం ఇస్తున్నది బీజేపీ.
మళ్లీ బీజేపీలోకి ‘గాలి’
బీజేపీ నేతగా ఉంటూనే అక్రమ మైనింగ్‌కు పాల్పడిన కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లొచ్చిన కర్ణాటక నేత, ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డిని కొంతకాలం బీజేపీ పక్కనపెట్టింది. ఆయన సోదరులకు మాత్రం టికెట్లు ఇచ్చింది. దీంతో బీజేపీపై కోపంతో గాలి జనార్ధన్‌రెడ్డి సొంత పార్టీ పెట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో బళ్లారి, బాగల్కోట్, కొప్పాళ జిల్లాలో బీజేపీకి నష్టం చేశారు. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి నష్టం జరగకుండా ఆయనను మళ్లీ బీజేపీలో చేర్చుకున్నారు.