Gujarat Farmula | గుజరాత్లో మాదిరిగా మరోసారి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా గుజరాత్ ఫార్ములాను కర్ణాటకలో అనుసరించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇప్పుడున్న సీఎంపై ప్రజల్లో ఆగ్రహం పోయేందుకు ఆయన్ను తప్పించేందుకు బీజేపీ చూస్తున్నది. ఆయన ప్లేస్‌లో మరోసారి యెడ్యూరప్పకు సీఎంగా అవకాశం ఇచ్చే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తొలిరోజు గుజరాత్ ఫార్ములాపై తీవ్రంగా చర్చించిన బీజేపీ పెద్దలు.. ఆ మోడల్‌ను కర్ణాటక ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. మే నెలాఖరులోగా కర్ణాటకలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. సమయం తక్కువగా ఉండటం, ప్రస్తుత సీఎంపై ప్రజల్లో కోపం ఉండటంతో ఆయన్ను మార్చేందుకు బీజేపీ చూస్తున్నది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పకు మరోసారి అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సోమవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో యెడ్యూరప్పతో ప్రధాని మోదీ 15 నిమిషాల సేపు మాట్లాడటం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలో యెడ్యూరప్ప ప్రాధాన్యం పెరుగుతున్నది. ఆయనను పార్టీ పార్లమెంటరీ బోర్డులో కూడా తీసుకున్నారు. లింగాయత్ సామాజికవర్గం మద్దతు ఆయనకు ఉండటంతో.. రానున్న ఎన్నికల్లో యెడ్డీ పేరుతో లబ్ధి పొందాలని బీజేపీ వ్యూహంగా ఉన్నది. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మహారాష్ట్రతో సరిహద్దు వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు వీడ్కోలు పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దక్షిణాదికి ముఖద్వారం అయిన కర్ణాటక బీజేపీకి చాలా ముఖ్యమైనది. ఇక్కడ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు చేయడం బీజేపీకి చాలా అవసరం. అందుకోసం ప్రజల్లో మద్దతు ఉన్న నేతకు పట్టం కట్టడం ద్వారా ఫలితం సాధించవచ్చునని పార్టీ పెద్దలు నమ్ముతున్నారు.