Shashi Tharoor | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం ఇప్పడు అందరి దృష్టికి ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గత మూడు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈ సారి ఎలాగైనా గెలువాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నది. కేరళలో తమ లోక్‌సభ విజయ ప్రస్థానానికి తిరువనంతపురాన్ని ఒక గేట్వేగా మార్చుకోవాలనే ప్లాన్‌లో ఉన్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను శశిథరూర్‌పై బరిలోకి దింపింది. మరోవైపు 2005 తర్వాతి నుంచి తమకు అందకుండా ఉన్న తిరువనంతపురంలో ఈసారి జెండా పాతాలని ఎల్డీఎఫ్ కూటమి భావిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర సీపీఐ అధ్యక్షుడు పన్నియన్ రవీంద్రన్ ఈ కీలక స్థానంలో పోటీచేస్తున్నారు.
కేరళలో ఇప్పటి వరకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలిచిన చరిత్ర బీజేపీకి లేదు. కమలం పార్టీ తిరువనంతపురంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈసారైనా తిరువనంతపురాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ కృత నిశ్చయంతో ఉన్నది. ఇక్కడ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను బరిలోకి దింపడం ద్వారా కేరళలో పాగా వేయాలని బీజేపీ సీరియస్‌గా ఉన్నదనే విషయం స్పష్టమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.