బెంగళూరు: కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అరవింద్ లింబావళి (Arvind Limbavali) సొంత పార్టీని విమర్శించారు. ప్రతిపక్షంగా తమ పార్టీ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్ అశోక మధ్య సఖ్యత, అవగాహన లేకపోవడం విచారకరమని అన్నారు. ఆర్ఎస్ఎస్కు సన్నిహితుడైన అరవింద్ లింబావళి, కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియడంపై ఎక్స్‌లో స్పందించారు. ముడా కుంభకోణం, వాల్మీకి డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన గ్రాంట్ల దుర్వినియోగం, రాష్ట్రంలో ప్రభలుతున్న డెంగ్యూ, భారీ వరదలు వంటి అనేక సమస్యలను తమ పార్టీ నేతలు అసెంబ్లీలో సమర్ధవంతంగా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
కాగా, మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీని సభలో నిలదీసే వ్యూహం కంటి తుడుపుగా ఉందని అరవింద్ లింబావళి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజల గొంతుకగా నిలవాల్సిన బీజేపీ, ప్రతిపక్షంగా పూర్తిగా విఫలమైందని అన్నారు. ‘ప్రభుత్వ కుంభకోణాలు, నిధుల దుర్వినియోగం, వైఫల్యాలను ఎత్తిచూపడానికి సభలో బీజేపీకి అవకాశం ఉన్నప్పటికీ, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో మా నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీకి ప్రమేయం ఉందా? అని ప్రజలు ఆలోచించడం ప్రారంభించారు’ అని బీజేపీ నేతలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకప్పుడు చాలా తక్కువ సీట్లు వచ్చినా సభల్లో గర్జించి ప్రజల ఆకాంక్షలకు ధీటుగా స్పందించిన తమ పార్టీ ప్రస్తుత పరిస్థితికి తాను చాలా ఆందోళన చెందుతున్నానని, నిరుత్సాహానికి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.