Dinesh Gundu Rao | బెంగళూరు, జూలై 8: కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఓ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న వీడియోపై బీజేపీ విమర్శలు చేసింది. ‘నగరాల్లోని నీటి కుంటలు అపరిశుభ్రతతో నిండిపోయి డెంగీ, మలేరియా వంటి జబ్బులు ప్రబలుతుంటే పేదల పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం స్వచ్ఛమైన ఈత కొలనులో తేలియాడుతున్నది’ అని విమర్శిస్తూ బీజేపీ ‘ఎక్స్’లో పేర్కొన్నది. మంత్రి దినేశ్ గుండూరావును రోమన్ చక్రవర్తి నీరోతో పోలుస్తూ ‘నీరో రావు’ అని విమర్శించింది.
దీంతో బీజేపీ విమర్శలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. స్విమ్మింగ్ తనకు వ్యాయామమని పేర్కొంటూ బీజేపీ నేతలను కూడా ఈత కొట్టమని సూచించారు.‘ఈత వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెదడు కూడా చురుగ్గా పని చేస్తుంది. అబద్ధాలను ఆశ్రయించడం, దృష్టి మళ్లించే వ్యూహాలు సృష్టించడమే కాకుండా వేరే విషయాలపై దృష్టి పెట్టడానికి మీకు ఉపయోగపడుతుంది’ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.