కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై డైమండ్ హార్బర్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ అలియాస్ బాబీని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. (BJP Suspends Party Leader) ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత హింసాత్మక సంఘటనలు జరిగిన డైమండ్ హార్బర్లోని పలు ప్రాంతాలను బీజేపీకి చెందిన కేంద్ర నిజనిర్ధారణ బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలలోని ఒక వర్గం నుంచి నిరసనను ఆ బృందం ఎదుర్కొంది. జూన్ 4న కౌంటింగ్ ముగిసిన తర్వాత జరిగిన అల్లర్లలో తాము నిరాశ్రయులమైనట్లు బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం తమను నిర్లక్ష్యం చేసిందని వారు ఆరోపించారు.
కాగా, బీజేపీకి చెందిన కేంద్ర నిజనిర్ధారణ బృందం ఎదుట నిరసనకు దిగిన వారు బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్‌కు అత్యంత సన్నిహితులేనని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తెలిపారు. ఈ నేపథ్యంలో దాస్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. బీజేపీ హైకమాండ్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన పార్టీ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.